చెన్నై, డిసెంబర్ 18: భారీ వర్షాలు, వరదల తాకిడికి దక్షిణ తమిళనాడు కకావికలమైంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెంకాశి జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. సోమవారం ప్రజలెవ్వరూ ఇండ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. వివిధ చోట్ల జరిగిన ప్రమాద ఘటనల్లో ఆరుగురు చనిపోయారని సమాచారం. లోతట్టు ప్రాంతాల నుంచి 7వేల మందిని దగ్గర్లోని పాఠశాలలు, మ్యారేజ్ హాల్స్‌కు విపత్తు నిర్వహణ సిబ్బంది తరలించింది. రైళ్ల రాకపోకలు నిలిచిపోవటంతో, తూత్తుకుడి జిల్లాలోని శ్రీవైకుంఠం వద్ద 800 మంది రైలు ప్రయాణికులు చిక్కుకుపోయారు.