Heat Wave Alert | దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా వేడిగాలులతో పాటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి చండ్ర నిప్పులకు గత రికార్డులు సైతం బద్దలవుతున్నాయి. ఇప్పటికే 1921 తర్వాత అంటే 103 ఏళ్ల తర్వాత ఏప్రిల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు (44 డిగ్రీలు) నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో ఎన్నడూ ఏప్రిల్ నెలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవలేదు. అయితే, మే నెలలోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఈశాన్య, వాయువ్య, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అన్నీ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని పేర్కొంది. దక్షిణ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరఠ్వాడా, గుజరాత్లలో మే నెలలో ఐదు నుంచి ఎనిమిది రోజుల వరకు వడగాలులు కొనసాగుతాయని అంచనా వేసింది. తూర్పు, ఈశాన్య భారతదేశంలో ఏప్రిల్లో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత (22 డిగ్రీల సెల్సియస్) 1901 తర్వాత అత్యధికంగా నమోదయైందని వాతావరణ శాఖ తెలిపింది.
తుఫానులు సగటు కంటే తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని పేర్కొంది. దక్షిణ ద్వీపకల్ప భారతంలో ఏప్రిల్లో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత (31 డిగ్రీల సెల్సియస్) 1901 నుంచి రెండోసారి అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సందర్భంగా ఐఎండీ చీఫ్ మృతుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో 1980 నుంచి సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. 2016 తర్వాత ఈ ఏప్రిల్లో ఒడిశాలో అత్యధికంగా వడగాలులు (16 రోజులు) రికార్డయ్యాయి.