Jammu and Kashmir : జమ్ము-కాశ్మీర్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన అనుమానాస్పద బెలూన్ కలకలం రేపింది. ఎరుపు రంగులో, హార్ట్ షేపులో ఉన్న బెలూన్ కథువా జిల్లా పరిధి, పహర్ పూర్ ప్రాంతంలో భద్రతా బలగాలు సోమవారం స్వాధీనం చేసుకున్నాయి. పహర్ పూర్ ప్రాంతం భారత సరిహద్దులో ఉంటుంది. ఈ బెలూన్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో భద్రత గురించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకుముందు అర్నియా ప్రాంతంలో కూడా ఇలాంటి ఒక బెలూన్ ను ఇటీవల అధికారుల స్వాధీనం చేసుకున్నారు. ఈ బెలూన్ కనిపించిన నేపథ్యంలో పోలీసులు అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ బెలూన్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎందుకు వచ్చింది అనే విషయాల్ని భద్రతా దళాలు విశ్లేషిస్తున్నాయి. ఆదివారం పాక్-భారత్ సరిహద్దు అయిన ఎల్వోసీలో, నౌషేరా-రాజౌరి సెక్టార్ వద్ద కొన్ని డ్రోన్లు అనుమానాస్పదంగా ఎగురుతూ కనిపించాయి. వాటిని గుర్తించిన భారత సైన్యం కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. దీంతో ఆ డ్రోన్లు తిరిగి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ భద్రతను మరింత పెంచారు. భద్రతా సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల ఎలాంటి డ్రోన్ ఇటువైపు రాలేదని స్థానికులు అంటున్నారు.
మరోవైపు తాజాగా వస్తున్న బెలూన్ల ద్వారా ఏమైనా ఆయుధాలు, డ్రగ్స్ వంటివి పాక్ నుంచి ఇండియాకు పంపిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ అంశంపై అక్కడ భద్రతా విభాగం గట్టి నిఘా పెట్టింది. ఉన్నతాధికారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.