Supreme Court | ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. సీఈసీ, ఈసీల నియామక ప్యానెల్లో గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం ఉండేవారు. అయితే, కేంద్ర ప్రభుత్వం గతేడాది సీజేఐని తొలగించి.. ఆ స్థానంలో కేంద్ర న్యాయశాఖ మంత్రికి చోటు కల్పిస్తూ.. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి.. చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఈసీ, ఈసీల నియామకాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఫిబ్రవరి 19న విచారిస్తామని కోర్టు ప్రకటించింది. పిటిషన్పై విచారణ సందర్భంగా ఎన్జీఓ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు.
సీఈసీ, ఈసీల ప్యానెల్ నుంచి సీజేఐని తొలగించి.. ప్రభుత్వ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు. పిటిషన్పై అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, పిటిషనర్ జయ ఠాకూర్ తరఫున హాజరైన న్యాయవాది వరుణ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రభుత్వం కొత్త చట్టం మేరకు నియామకాలు చేపడుతుందని తెలిపారు. నియామకాలను సవాల్ చేసినట్లు పేర్కొన్నారు. దిలా ఉండగా.. ప్రభుత్వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ను నియమించిన విషయం తెలిసిందే. ఆయన గతేడాది సహకార మంత్రిత్వ శాఖలో పని చేస్తూ పదవీ విరమణ చేశారు. సీఈసీ రాజీవ్ కుమార్ మంగళవారం పదవీ విరమణ చేయగా.. బుధవారం భారతదేశ 26వ సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీఈసీ నియామకం విషయంలో కేంద్రంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టంపై సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సమయంలో అర్ధరాత్రి కొత్త సీఈసీని నియమించడంపై మండిపడింది.