న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వ్యాక్సిన్ల తయారీ సామర్ధ్యం మెరుగైందని రాబోయే రెండు నెలల్లో నెలకు 45 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 138 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని ఆయన సోమవారం రాజ్యసభలో పేర్కొన్నారు. 55.24 కోట్ల మందికి వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయ్యాయని చెప్పారు.
ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద తగినన్ని వ్యాక్సిన్ నిల్వలున్నాయని చెప్పారు. దేశ జనాభాలో 88 శాతం మందికి వ్యాక్సిన్ తొలి డోసు పూర్తయిందని, 58 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయని తెలిపారు. భారత్‌లో అత్యధిక జనాభాకు వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. డిసెంబర్ చివరినాటికి వయోజనులందరికీ కనీసం కరోనా వ్యాక్సిన్ ఒక డోసును అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.
దేశంలో ప్రస్తుతం కొవిషీల్డ్, కొవ్యాక్సిన్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న క్రమంలో భారత్‌లో థర్డ్ వేవ్ తలెత్తుతుందని నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో అవసరమైన ఔషధాలతో పాటు మౌలిక వసతులను సిద్ధం చేశామని చెప్పారు. ఫస్ట్, సెకండ్ వేవ్‌లను పరిశీలించిన మీదట తాజా వేరియంట్ ప్రబలినా మనకు ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కాబోవని విశ్వాసం వ్యక్తం చేశారు.