ముంబై : ఒమిక్రాన్ కేసులు ముంచెత్తుతున్నప్పటికీ మహారాష్ట్రలో ఇప్పట్లో లాక్డౌన్ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. లాక్డౌన్ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని, మెడికల్ ఆక్సిజన్ లభ్యత, ఆస్పత్రుల్లో పడకల పరిస్ధితిని సమీక్షంచి ఓ నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం లాక్డౌన్ విధింపును పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపింది.
ఆస్పత్రుల్లో కొవిడ్ పడకలు 40 శాతం భర్తీ అయితే, మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ రోజుకు 800 మెట్రిక్ టన్నులు దాటితే లాక్డౌన్ లేదా లాక్డౌన్ తరహా నియంత్రణలను మహారాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొంది. కొవిడ్-19 కేసుల పెరుగుదల ఫిబ్రవరి ద్వితీయార్ధంలో ముమ్మర దశకు చేరుకుని మార్చి మధ్యలో తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నామని తెలిపింది.
రాష్ట్రంలో ప్రస్తుతం సినిమా హాళ్లు, మాల్స్‌ను మూసివేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే రాష్ట్ర క్యాబినెట్లో చర్చించిన అనంతరం సీఎం ఓ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇక మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 26,538 కొవిడ్-19 కేసులు వెలుగుచూడగా మహమ్మారి బారినపడి 8 మంది ప్రాణాలు విడిచారు. ముంబైలో అత్యధికంగా 15,166 కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.