Delhi blast : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో సోమవారం రాత్రి చోటుచేసుకున్న బాంబు పేలుడు (Bomb blast) ఘటన ఎన్నో ఇళ్లలో విషాదం నింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య డజనుకు చేరింది. మూడు పదులకుపైగా జనం గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదగాధ. అందులో యూపీ (Uttarpradesh) కి చెందిన నోమన్ (Noman) ది కూడా ఓ విషాదగాధనే.
ఉత్తరప్రదేశ్లోని షామ్లీకి చెందిన నోమన్ స్థానికంగా కాస్మెటిక్స్ దుకాణం నిర్వహిస్తున్నాడని, సోమవారం దుకాణానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఢిల్లీకి వెళ్లి బాంబు పేలుడులో ప్రాణాలు కోల్పోయాడని అతడి మేనమామ తెలిపారు. మార్కెట్కు వెళ్లిన నోమన్ మళ్లీ తిరిగి రాలేదని గద్గద స్వరంలో చెప్పారు.
సోమవారం రాత్రి ఘటన తర్వాత తనకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని, నోమన్ ప్రమాదంలో గాయపడ్డాడని వారు చెప్పారని మృతుడి మేనమామ వెల్లడించారు. మేం ఆస్పత్రికి వెళ్లేసరికి మృతదేహం కనిపిందని చెబుతూ విలపించారు. ఈ పేలుళ్లకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.