లక్నో : ప్రసవానంతరం తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ 15 రోజుల నవజాత శిశువును ఫ్రీజర్‌లో పెట్టి మర్చిపోయింది. ఆ బిడ్డ ఏడుపు విన్న కుటుంబ సభ్యులు వెంటనే పరుగెత్తుకొని వచ్చి, ఫ్రీజర్ నుంచి బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది. వెంటనే డాక్టర్ వద్దకు తీసుకుపోగా.. బిడ్డ క్షేమంగా ఉన్నాడని చెప్పటంతో వాళ్లంతా ఊపిరిపీల్చుకున్నారు. అందర్నీ షాక్‌కు గురిచేసిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.
ప్రసవం అనంతరం ఆ తల్లి మానసిక రుగ్మతకు గురయ్యారని, అందువల్లే ఈ ఘటన జరిగిందని వైద్యులు తేల్చారు. ప్రసవం తర్వాత హార్మోన్లలో మార్పులు, తీవ్రమైన మానసిక ఒత్తిడి తల్లి అహేతుక నిర్ణయానికి దారితీసింది. సరైన చికిత్స అందించకపోతే, బిడ్డకు హాని చేయటం లేదా తమకు తాము హానికి పాల్పడటం వంటివి చేస్తారని వైద్యులు తెలిపారు.