గురుగ్రామ్: సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ తన పరువు తీస్తున్నదన్న కోపంతో జాతీయ టెన్నిస్ క్రీడాకారిణిని ఆమె తండ్రి కాల్చి చంపాడు. హర్యానాలోని గురుగ్రామ్‌లో సుశాంత్ లోక్-ఫేజ్2లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ (25)ను గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఆమె తండ్రి కాల్చి చంపాడు.
పలు టోర్నీల్లో జాతీయ స్థాయిలో బహుమతులు గెల్చుకున్న రాధికా యాదవ్ రెండేళ్ల క్రితం అయిన గాయం వల్ల టెన్నిస్‌కు దూరంగా ఉంటున్నది. దీంతో ప్రత్యామ్నాయ వృత్తిని ఎంచుకునే క్రమంలో ఆమె మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారాలనుకుంది. దీంతో గత కొన్ని నెలలుగా ఆమె రీల్స్ చేసి ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో పోస్ట్ చేస్తుండేది. అది తమ కుటుంబానికి అవమానం కలిగిస్తున్నదని తండ్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ క్రమంలో రీల్స్ చేయవద్దంటూ కుమార్తెపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె నిరాకరించడంతో హత్య చేసినట్టు భావిస్తున్నారు.