ముంబై, జూన్ 1: అది బీజేపీ పాలిత రాష్ట్రం.. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి ఆ రాష్ట్రానికి చెందినవారే.. అంతేకాదు సాక్షాత్తూ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద చేపట్టిన రోడ్డు నిర్మాణం.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడు ఆ రోడ్డు ఎంతో నాణ్యతతో కొన్ని ఏండ్లపాటు చెక్కుచెదరకుండా ఉండాలి. కానీ చేతులతో పీకేస్తే ఊడిపోయిన ఈ రోడ్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నది.
మహారాష్ట్రలోని జాల్నా జిల్లా అంబాద్ తాలుకా పరిధిలో ఇటీవల రోడ్డు వేశారు. ఒక పాలిథిన్ కవరును పరిచి దానిపై తారు పోశారు. ఈ రోడ్డు నాణ్యతను ప్రజలకు తెలియజేయాలనుకున్న స్థానికులు చేతులతో తారును పీకేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను వీక్షించిన నెటిజన్లు డబుల్ ఇంజిన్ పాలన అంటే ఇదేమరి అని కామెంట్ చేశారు.