PM Modi | పాట్నా: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై బీహార్ అధికార పార్టీ జేడీయూ మండిపడింది. ప్రధాని మోదీ నకిలీ ఓబీసీ అని, గుజరాత్లో గతంలో ఓబీసీల్లో చేర్పులకు సంబంధించిన వ్యవహారాలు బయటపడుతాయనే కులగణనకు జంకుతున్నదని విమర్శించింది. జేడీయూ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ ఆదివారం పాట్నాలో మీడియాతో మాట్లాడారు. తాను అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తినని ప్రధాని మోదీ చెప్పుకోవడాన్ని ప్రశ్నించారు.
2002లో గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఎన్నికల లబ్ధి కోసం మోదీ తన కులం ‘మోద్ ఘంచి’ని ఓబీసీ జాబితాలో చేర్చారని ఆరోపించారు. అయితే ఇది 1994లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిందని మభ్యపెట్టేందుకు మోదీ ప్రయత్నించారని అన్నారు. 1994లో ‘ఘంచి’లోని ఆరు ఉప కులాల్లో ఘంచి(ముస్లిం) వర్గాన్ని మాత్రమే ఓబీసీలో చేర్చారని నీరజ్ కుమార్ వివరించారు. సంబంధిత కేంద్ర ప్రభుత్వ గెజిట్ను మీడియా సమావేశంలో చూపారు. ఆధారాలు ఉంటే తాను చెబుతున్న దాన్ని తిప్పికొట్టాలని బీజేపీకి సవాల్ విసిరారు.