Karnataka | బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు తీరుతో విసిగిపోయిన ఓ చిన్న స్థాయి కాంట్రాక్టర్ దీనస్థితిలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్‌కు లేఖ రాశారు. అప్పు చేసి చేపట్టిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, తన కారుణ్య మరణానికి అనుమతించాలని గవర్నర్‌కు లేఖ రాశారు. దేవనగరెకు చెందిన మహమ్మద్ మఝార్ అనే కాంట్రాక్టరు 2022, 2023లో కర్ణాటక ప్రజా పనుల శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులు చేశారు.
ఇందుకు సంబంధించి ఆయనకు రూ.25 లక్షల బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. పనులు పూర్తి చేసినా, అధికారుల పరిశీలన పూర్తయినా తనకు బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టురు ఆరోపిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని, తనకు మరణం తప్ప మరో మార్గం లేదని గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
కాంట్రాక్టర్ లేఖపై కేంద్రమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి స్పందించారు. సిద్ధరామయ్య ప్రభుత్వంపై ‘ఎక్స్’లో ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ది 60% కమీషన్ ప్రభుత్వమని ఆరోపించారు. ఈ ప్రభుత్వం లో భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నారని కాంగ్రెస్‌తో సంబంధాలున్న కాంట్రాక్టర్లు సైతం ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాంట్రాక్టరుకు బకాయిలు చెల్లిస్తారా? ఆయన కారుణ్య మరణానికి అనుమతిస్తారా? అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆయన ప్రశ్నించారు.