న్యూఢిల్లీ, ఆగస్టు 11: విద్వేష ప్రసంగాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, వాటికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసులను పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటుచేయాలని సూచించింది. విద్వేష ప్రసంగాలను అడ్డుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ జర్నలిస్ట్ షాహీన్ అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఓ వర్గం వారిని అంతమొందించాలని, వారిని బహిష్కరిం చాలని కొందరు తమ విద్వేష ప్రసంగాలతో రెచ్చగొడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. జాతుల మధ్య సామరస్యం అవసరమని పేర్కొన్నది. అందరూ బాధ్యతగా మెలగాలని సూచించింది. కమిటీ ఏర్పాటుపై ఈ నెల 18లోగా స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.