న్యూఢిల్లీ, జనవరి 6: ‘పున్నామ నరకం నుంచి రక్షించే వాడే పుత్రుడు’ అని మన భారతీయులు నమ్ముతుంటారు. అందుకే ఒక్కరైనా మగ సంతానం ఉండాలని చాలామంది భారతీయులు తపించుపోతుంటారు. హర్యానాలో కూలి పనిచేసుకునే ఒక జంట కూడా ఇలాగే భావించింది. 19 ఏండ్ల వైవాహిక జీవితంతో 10 మంది సంతానం కలిగినా వారంతా ఆడపిల్లలే కావడంతో వారు మగబిడ్డ కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఫతేహాబాద్‌కు చెందిన 37 ఏండ్ల మహిళ జింద్‌లో ఈ నెల 3న ఒక మగపిల్లాడికి జన్మనివ్వడంతో దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మగ పిల్లాడి కోసం తమ నిరీక్షణ ఇన్నాళ్లకు ఫలించిందని బాలుడి తండ్రి సంజయ్ కుమార్ ఆనందంతో తెలిపాడు. మగ పిల్లవాడు అంటే తమకు చాలా మక్కువని, అలాగని ఆడపిల్లల పట్ల చిన్నచూపు లేదని, తమ పెద్ద కుమార్తె 12వ తరగతి చదువుతున్నదని, మిగిలిన పిల్లలకు కూడా మంచి చదువు చెప్పించడానికి ప్రయత్నిస్తానని ఆయన తెలిపాడు. అయితే తన 10 మంది కుమార్తెల పేర్లు చెప్పడంలో ఆయన తడబడ్డాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది.