చండీఘడ్: HR88B8888. ఈ లక్కీ నెంబర్ గుర్తుందా. ఆ వీఐపీ నెంబర్‌కు మళ్లీ వేలం వేయనున్నారు. ఇటీవల హర్యానా రవాణా శాఖ నిర్వహించిన వేలంలో ఆ నెంబర్ కోసం ఓ వ్యక్తి 1.17 కోట్ల వేలం పాడిన విషయం తెలిసిందే. అయితే అతనికి ఇచ్చిన డెడ్‌లైన్‌లోగా డబ్బులు చెల్లించకపోవడంతో మళ్లీ ఆ నెంబర్ కోసం రవాణా శాఖ వేలం నిర్వహించనున్నది. రోములస్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన ట్రాన్స్‌పోర్టేషన్ డైరెక్టర్ సుధీర్ కుమార్ వేలంలో ఆ నెంబర్‌ను దక్కించుకున్నాడు. HR88B8888 నెంబర్ కోసం అతను 1.17 కోట్ల బిడ్ వేశాడు. దీంతో ఇండియాలోనే అత్యంత ఖరీదైన వెహికిల్ నెంబర్‌గా రికార్డు అయ్యింది.
ఆ లక్కీ నెంబర్ కోసం డిసెంబర్ ఒకటో తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా డబ్బులు చెల్లించాల్సి ఉన్నది. కానీ డెడ్‌లైన్ ముగిసినా సుధీర్ కుమార్ ఆ మొత్తాన్ని చెల్లించలేకపోయారు. శనివారం రాత్రి రెండు సార్లు డబ్బులు డిపాజిట్ చేసేందుకు ప్రయత్నించానని, కానీ సాంకేతిక లోపం వల్ల ఆ అమౌంట్ డిపాజిట్ కాలేదని బిడ్డర్ కుమార్ తెలిపారు. ఓ నెంబర్ ప్లేట్ కోసం అంత డబ్బులు చెల్లించడాన్ని కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తున్నట్లు సుధీర్ చెప్పాడు.
సాధారణంగా వీఐపీ నెంబర్ల కోసం హర్యానాలో ఆన్లైన్ వేలం నిర్వహిస్తుంటారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఆ వేలం జరుగుతుంది. తమకు కావాల్సిన నెంబర్ల కోసం కస్టమర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. బధువారం సాయంత్రం 5 గంటలకు వేలంలో గెలిచినవారి ఫలితాలను ప్రకటిస్తారు. వేలం ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. అయితే HR88B8888 కోసం అత్యధికంగా 45 మంది దారఖాస్తు చేసుకున్నారు. దీంతో దీనికి బేస్ ప్రైజ్‌ను 50 వేలుగా నిర్దారించారు. వేలంలో ఆ నెంబర్ 1.17 కోట్లు పలికింది.
HR88B8888 నెంబర్‌కు ప్రత్యేకత ఉన్నది. వీఐపీ నెంబర్‌గా దీన్ని భావిస్తున్నారు. వేలంలో ఈ నెంబర్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆ నెంబర్లో HR అంటే హర్యానా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ జరిగినట్లు. 88 అంటే రీజినల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసుకు సంకేతం, లేదా హర్యానాలోని జిల్లాను సూచిస్తుంది. ఆ ఆర్టీవో ఆఫీసులోనే వెహికిల్ రిజిష్ట్రేషన్ జరిగినట్లు. ఇక B అంటే వెహికిల్ సిరీస్ కోడ్. ఆ ఆర్టీవో పరిధిలో ప్రస్తుతం నడుస్తున్న కోడ్ అని అర్థం. ఇక 8888 అంటే ఓ విశిష్టమైన నాలుగు అంకెల రిజిస్ట్రేషన్‌కు సంకేతం.