Farmers Protests | అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడానికి చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో రైతుల పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో ఈ నెల 13న పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ‘చలో పార్లమెంట్’కు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన హర్యానా సర్కార్.. అంబాలా, కురుక్షేత్ర, కైథల్, జింధ్, హిస్సార్, ఫతేహబాద్, సిర్సా జిల్లాల పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఏడు జిల్లాల పరిధిలో ఒకేసారి భారీగా ఎస్ఎంఎస్లు పంపడంపై ఈ నెల 11 ఉదయం ఆరు గంటల నుంచి 13 రాత్రి 12 గంటల వరకూ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ సరిహద్దులు మూసివేసేందుకు హర్యానా పోలీసులు సిద్ధం అయ్యారు.
మరోవైపు, ట్రాక్టర్ ర్యాలీతో వచ్చే రైతులను అడ్డుకునేందుకు అంబాలా జిల్లాలోని రహదారులపై పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. గ్రేటర్ నోయిడా, నోయిడా ప్రాంతాల రైతులు గురువారం పార్లమెంటుకు బయలుదేరగా ఢిల్లీ నగర శివారుల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలను రంగంలోకి దించారు. ప్రతి ఒక్కరినీ చెక్ చేసిన తర్వాత ఢిల్లీలోకి అనుమతించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హర్యానా ప్రభుత్వ తీరును రైతు సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు.