జమ్ముకశ్మీర్‌లో నాలుగు గ్యారెంటీలు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు. హిమాచల్‌లో 10 గ్యారెంటీలు.. హర్యానాలో ఏడు గ్యారెంటీలు అంటూ ఓట్ల కోసం అర్రాసు పాట పాడిన కాంగ్రెస్‌కు ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారు. హిమాచల్, కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీల పేరుతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత బోడి మల్లన్న అంటున్న సంగతిని హర్యానా ప్రజలు గుర్తించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తిరగరాస్తూ , ఆశలను ఆవిరిచేస్తూ కాంగ్రెస్‌ను ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేశారు. తెలంగాణను మాడల్‌గా చూపించి హర్యానాలో గెలవాలనుకున్న కాంగ్రెస్ పెద్దల ఆశలను ఓటర్లు చిదిమివేశారు. కర్ణాటక, తెలంగాణలలో పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందని, ఇది ఇతర రాష్ర్టాల్లో కాంగ్రెస్ విజయావకాశాల మీద ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందన్న అధిష్ఠానం భయం అఖరికి అక్షరాలా నిజమైంది. రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మరీ కాంగ్రెస్ తెలంగాణలో మోసం చేసిందనే వాస్తవం, అక్కడి జాట్ రైతుల మనసులో ఎంత వ్యతిరేకత ఉన్నా బీజేపీవైపు మొగ్గేలా చేసింది.
చండీగఢ్, అక్టోబర్ 8: హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పదేండ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కన్న ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రైతులు, రెజ్లర్ల పోరాటం, పదేండ్ల బీజేపీ పాలనపై ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో ఈసారి గెలుపు ఖాయమనుకున్న చోట హస్తం పార్టీ బొక్కబోర్లా పడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదట్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితాల సరళి కనిపించింది. కానీ, బీజేపీ అనూహ్యంగా పుంజుకొని మ్యాజిక్ ఫిగర్‌ను దక్కించుకుంది. 90 సీట్లకు గానూ ఆ పార్టీకి 48 సీట్లు దక్కగా, కాంగ్రెస్ పార్టీ 37 సీట్లకు పరిమితమైంది. స్వతంత్రులు ముగ్గురు, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ) నుంచి ఇద్దరు విజయం సాధించారు. ఆప్ ఒక్క స్థానాన్నీ గెలవలేదు. గత ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు గెలవగా(2022 అదంపూర్ ఉప ఎన్నిక సహా) ఈసారి ఏడు స్థానాలను పెంచుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెలవగా, ఈసారి తొమ్మిది స్థానాలు ఎక్కువ వచ్చాయి.
ప్రముఖుల గెలుపోటములు
లద్వా నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ 16 వేల మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ కీలక నేత భూపిందర్ సింగ్ హుడా, హిసార్ నుంచి స్వతంత్ర అభ్యర్థి, దేశంలోనే ధనవంతురాలు సావిత్రి జిందాల్ విజయం సాధించారు. జులానా నుంచి మొదటిసారి బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి, రెజ్లర్ వినేశ్ ఫోగట్ 6,015 ఓట్ల తేడాతో ప్రత్యర్థి యోగేశ్ కుమార్‌పై గెలుపొందారు. ఐఎన్ఎల్డీ కీలక నేత అభయ్ చౌతాలా ఓటమి చవిచూశారు. జన్నాయక్ జనతా పార్టీ(జేజేపీ) నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతాలా సైతం ఓడిపోయారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రివర్స్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ సంస్థలేవీ సరిగ్గా అంచనా వేయలేకపోయాయి. స్థానిక సర్వే సంస్థలు మొదలు జాతీయ స్థాయిలో పేరుమోసిన సంస్థల వరకు అన్నీ ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని 50-70 సీట్లు రావొచ్చని చెప్పాయి. కానీ, అనూహ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకుంది.
పట్టు కోల్పోయిన చౌతాలా కుటుంబం
మాజీ ఉప ప్రధాని దేవీలాల్ కుటుంబం ఈ ఎన్నికలతో హర్యానా రాజకీయాల్లో పూర్తిగా పట్టు కోల్పోయింది. దేవీలాల్ తనయుడు ఓంప్రకాశ్ చౌతాలా నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీకి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆదరణ ఉండేది. 2018 వరకు హర్యానా రాజకీయాల్లో ఐఎన్ఎల్డీ ప్రభావం ఉండేది. చౌతాలా కుటుంబంలో విభేదాలతో ఓంప్రకాశ్ చౌతాలా పెద్ద కుమారుడు అజయ్ సింగ్ చౌతాలా జన్నాయక్ జనతా పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల్లో ఈ పార్టీ 10 సీట్లు సాధించింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో జేజేపీ కింగ్‌మేకర్ అయ్యింది. అజయ్ సింగ్ చౌతాలా కుమారుడు దుశ్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీతో జేజేపీ పొత్తు విచ్ఛిన్నమైంది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జేజేపీ ఒక్క స్థానాన్నీ గెలుచుకోలేదు. దుశ్యంత్ చౌతాలా సైతం ఓడారు. ఐఎన్ఎల్డీ రెండు స్థానాలకే పరిమితమైంది.
మరోసారి సీఎంగా సైనీ!
హర్యానా ముఖ్యమంత్రిగా మరోసారి నాయబ్ సింగ్ సైనీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కొన్ని నెలల ముందే మనోహర్‌లాల్ ఖట్టర్‌ను సీఎం పదవి నుంచి తప్పించి సైనీకి బీజేపీ హైకమాండ్ పగ్గాలు అప్పగించింది. ఓబీసీ నాయకుడైన సైనీ సారథ్యంలో బీజేపీ హర్యానాలో అనూహ్యంగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో మరోసారి సైనీకే సీఎం బాధ్యతలు అప్పగించాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
ఉదయం స్వీట్లు.. మధ్యాహ్నానికి పాట్లు
హర్యానా ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కాంగ్రెస్ విచిత్ర పరిస్థితులను ఎదుర్కొన్నది. లెక్కింపు ఆరంభంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ట్రెండ్స్ ఉండటంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. కార్యకర్తలు స్వీట్లు పంచుకొని, డప్పుచప్పుళ్లతో నృత్యాలు చేశారు. అయితే, కొద్దిసేపటికే ఫలితాల సరళి బీజేపీకి అనుకూలంగా మారడంతో ఉసూరుమన్నారు. కాగా, ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. మ్యానిపులేషన్ ద్వారా బీజేపీ హర్యానాలో గెలిచిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. 14 నియోజకవర్గాల్లో ఈవీఎంల పనితీరు, లెక్కింపు ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. తమ గెలుపును లాక్కున్నారని, ఈ ఫలితాలను అంగీకరించలేమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ విమర్శలను బీజేపీ తప్పుబట్టింది. ఆ పార్టీ ఉదయం 8.30కు జిలేబీలు పంచుకుందని, 11.30కు ఎన్నికల కమిషన్‌ను విమర్శిస్తున్నదని బీజేపీ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా ఎద్దేవా చేశారు.