లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. త్వరలో జరుగనున్న పది అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికలకు ఆరుగురు అభ్యర్థులను ప్రకటించారు. హర్యానా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దారుణ ఫలితాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్హల్ అసెంబ్లీ స్థానం నుంచి అఖిలేష్ యాదవ్ బంధువు తేజ్ ప్రతాప్ యాదవ్, సిసామావు స్థానం నుంచి అనర్హత పొందిన ఎస్పీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి భార్య నసీమ్ సిద్ధిఖీ బరిలోకి దిగనున్నారు. ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్‌ను అయోధ్యలోని మిల్కీపూర్ స్థానం నుంచి, అంబేద్కర్ నగర్ ఎస్పీ ఎంపీ లాల్జీ వర్మ భార్య శోభావతి వర్మను కతేరీ అసెంబ్లీ స్థానం నుంచి, ఫుల్పూర్ అభ్యర్థిగా ముస్తఫా సిద్ధిఖీ, మజ్వా స్థానం నుంచి జ్యోతి బింద్‌ను పోటీకి దించింది.
కాగా, ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించాలని తమ పార్టీ కోరుతున్నదని ఎస్పీ అధికార ప్రతినిధి ఫక్రుల్ హసన్ చంద్ తెలిపారు. దీంతో ప్రచారానికి తగినంత సమయం ఇచ్చేందుకే అభ్యర్థులను ముందుగా ప్రకటించినట్లు చెప్పారు. అభ్యర్థులను ప్రకటించిన ఆరింట ఐదు స్థానాల్లో తమ పార్టీ లేదా అభ్యర్థులు విజయం సాధించారని అన్నారు. అందుకే ఈ సీట్లపై కాంగ్రెస్‌కు హక్కులేదని వెల్లడించారు. మిగతా నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌కు ఏ సీట్లు కేటాయించాలి అన్నది తమ అధిష్టానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.