హైదరాబాద్ : ఇవాళ అసెంబ్లీలో మూసీ ప్రక్షాళనపై చర్చ సందర్భంగా స్పీకర్ పక్షపాత వైఖరి చూపించారు. బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతుంటే పలుమార్లు మైక్ కట్ చేశారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే మైక్ ఇవ్వనని చెప్పడాన్ని తప్పుపట్టారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు బాయ్‌కాట్ చేశారు.
అనంతరం అసెంబ్లీ ఆవరణలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపైన, సీఎం రేవంత్‌రెడ్డిపైన తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రేవంత్ రెడ్డీ.. నువ్వు ముఖ్యమంత్రివా.., స్ట్రీట్ రౌడీవా..’ అని ప్రశ్నించారు. కేసీఆర్ గురించి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నావని మండిపడ్డారు. సీఎం నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ప్రధాన ప్రతిపక్షానికి అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని విమర్శించారు.
ముఖ్యమంత్రిపై తాము విమర్శలు చేయొద్దని స్పీకర్ అంటున్నాడని, ఇంక తాము ఉండి ఎందుకని హరీశ్‌రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే మైక్ కట్ చేస్తానని స్పీకర్ ఆన్ రికార్డ్ అంటున్నారని విమర్శించారు. స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా ఈ సెషన్‌ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తున్నదని చెప్పారు.