Hardeep Singh Puri | క్లీన్ ఎనర్జీ కింద భారత్‌లో 2030 నాటికి సీఎన్జీ స్టేషన్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని.. దాంతో మొత్తం 18వేలకు చేరుతాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. సోషల్ మీడియా పోస్ట్‌లో వన్ నేషన్, వన్ గ్యాస్ గ్రిడ్ పథకం కింద సాధించిన విజయాలను హైలైట్ చేశారు. 2014లో దేశంలో కేవలం 738 సీఎన్జీ స్టేషన్లు మాత్రమే ఉన్నాయని.. ఈ సంఖ్య నేడు 8,150కి పెరిగిందన్నారు. బస్సులు, ఆటోలు, కార్లకు సరసమైన, స్వచ్ఛమైన ఇంధనంతో శక్తిని అందిస్తోంది. 2030 నాటికి ఈ నెట్వర్క్ 18వేలకుపైగా స్టేషన్లకు విస్తరిస్తుందన్నారు. గత దశాబ్దంలో పట్టణ గ్యాస్ పంపిణీ నెట్వర్క్ అపూర్వమైన విస్తరణను చూసిందని మంత్రి పేర్కొన్నారు.
2014లో కేవలం 55 భౌగోళిక ప్రాంతాలకే పరిమితమైన నెట్వర్క్ ఇప్పుడు 307 ప్రాంతాలకు విస్తరించిందని.. ఇది దాదాపు మొత్తం దేశాన్ని కవర్ చేస్తుందన్నారు. జనాభాలో 99 శాతం, భూభాగంలో 96 శాతానికి చేరుకుందన్నారు. ప్రస్తుతం 1.52 కోట్ల గృహాలు పైప్డ్ సహజ వాయువు (PNG)తో అనుసంధానమయ్యాయని.. దాంతో వంటశాలలు సురక్షితంగా, శుభ్రంగా ఉంటాయన్నారు. ఈ వ్యవస్థకు గ్యాస్ పైప్‌లైన్ నెట్వర్క్ వెన్నెముకలాంటిదని పేర్కొన్నారు. ప్రస్తుతం పైప్లైన్లు 25,429 కిలోమీటర్ల విస్తరించాయని.. నిర్మాణ పనులు కొనసాగుతున్నందున 2030 నాటికి 33,475 కిలోమీటర్లకు విస్తరిస్తాయని భావిస్తున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ తీరప్రాంతాల నుంచి మారుమూల పట్టణాలకు నిరంతరాయంగా ఇంధన సరఫరా చేయడాన్ని నిర్ధారిస్తుంది. దేశం కూడా గ్రీన్ ఇంధనం వైపు కదులుతోందని కేంద్రమంత్రి పూరీ చెప్పారు. ఇప్పటివరకు 113 కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్లు ప్రారంభమయ్యాయని.. మరో 78 ప్లాంట్లు పైప్‌లైన్‌లో ఉన్నాయన్నారు.
గత సంవత్సరం దాదాపు 42,800 టన్నుల సీబీజీని సేకరించారని.. ఈ సంవత్సరం బ్లెండింగ్ లక్ష్యాన్ని ఒకశాతంగా నిర్ణయించారు. దీనిని 2028 నాటికి 5 శాతానికి పెంచనున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం.. జూన్ 2025 నాటికి భారతదేశ మొత్తం స్థాపిత సామర్థ్యం 476 గిగావాట్లకు చేరుకుంది. ఇందులో 240 గిగావాట్లు థర్మల్ విద్యుత్ నుంచి వస్తాయి. ఇది మొత్తం ఉత్పత్తిలో 50.52 శాతం. శిలాజేతర ఇంధన వనరులు 235.7 గిగావాట్లు. మొత్తం సామర్థ్యంలో 49 శాతం దోహదం చేస్తాయి. ఇందులో 226.9 GW పునరుత్పాదక శక్తి, 8.8 GW అణుశక్తి ఉండగా.. గ్యాస్ ఆధారిత విద్యుత్ మొత్తం సామర్థ్యంలో 20 GW దోహదపడుతుంది. గత పదకొండు సంవత్సరాలలో భారతదేశం పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. COP26 నిబద్ధతకు అనుగుణంగా 2030 నాటికి శిలాజేతర ఇంధన వనరుల నుంచి 500 GW స్థాపిత సామర్థ్యాన్ని సాధించడానికి ఇంధన మంత్రిత్వ శాఖ కృషి చేస్తున్నది.
One Nation, One Gas Grid – the blueprint of Modi’s Bharat.
>>1.52 crore homes use PNG today, up from just 55 areas in 2014 to 307 areas covering 99% of the population.
>>CNG stations grew from 738 in 2014 to 8,150+ today, set to reach 18,000 by 2030.
>>Pipelines stretch 25,429… pic.twitter.com/wfxT4Y0xji— Hardeep Singh Puri (@HardeepSPuri) August 29, 2025