న్యూఢిల్లీ: వలస నిబంధనలను అమెరికా కఠినతరం చేయడంతో హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గిపోయాయి. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 4,70,342 ఎలిజిబుల్ హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇవి 3,43,981కి తగ్గిపోయాయి. అంటే, 26.9 శాతం తగ్గుదల కనిపించింది. కొత్త హెచ్-1బీ వీసాలను కోరిన వ్యక్తుల సంఖ్య కూడా తగ్గింది.
ఈ ఏడాది ఎలిజిబుల్ యూనిక్ బెనిఫిషియరీస్ 3,36,000 మంది కాగా, నిరుడు వీరి సంఖ్య 4,23,000. అనేక యాజమాన్యాలు ఒకే లబ్ధిదారు తరపున దాఖలు చేసే రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇవి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 47,314 కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 7,828కి తగ్గిపోయాయి. హెచ్-1బీ వీసా జారీ ప్రక్రియను కఠినతరం చేసినందు వల్ల మోసపూరిత దరఖాస్తులు తగ్గినట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. తప్పుడు వివరాలు, స రైనది కాని పాస్‌పోర్టు లేదా ట్రావెల్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ సమర్పిస్తే, రిజిస్ట్రేషన్‌ను చెల్లనిదిగా ప్రకటిస్తామని స్పష్టంచేసింది.