న్యూఢిల్లీ: భారత ప్రధాన ఎన్నికల అధికారిగా(సీఈసీ) కేరళ క్యాడర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న కొత్త సీఈసీ ఎంపిక కోసం సమావేశం జరగనుంది.
మొత్తం 480 మంది ఈ పోస్టుకు పోటీ పడుతుండగా సెర్చ్ కమిటీ అయిదుగురి పేర్లను ఎంపిక కమిటీకి సిఫారసు చేయనున్నట్టు సమాచారం. వీరిలో జ్ఞానేశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఈ నెల 17న జరిగే సమావేశంలో ప్రధాని మోదీ, న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కలిసి కొత్త సీఈసీని ఎంపిక చేస్తారు. 1988 బ్యాచ్‌కు చెందిన జ్ఞానేశ్ కుమార్ సహకార శాఖ కార్యదర్శిగా నిరుడు జనవరి 31న రిటైర్డ్ అయ్యారు.