న్యూఢిల్లీ, ఆగస్టు 19 : అస్సాం పోలీసులు తమపై జూలైలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కు సంబంధించి కొత్త దేశద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ది వైర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్తోసహా అందులోని జర్నలిస్టులపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ పోలీసులకు నోటీసులు జారీచేసిన రోజే అస్సాం పోలీసులు నమోదుచేసిన మరో దేశద్రోహం కేసు కింద వరదరాజన్‌కు, సీనియర్ జర్నలిస్టు కరణ్ థాపర్‌కు గువాహటి క్రైమ్ బ్రాంచ్ సమన్లు జారీచేసింది. వరదరాజన్‌కు పోలీసు ఇన్స్పెక్టర్ సైమర్జ్యోతి రే జారీచేసిన సమన్లలో ఎఫ్ఐఆర్ తేదీని కాని, నేరారోపణలు కాని ప్రస్తావించకపోగా ఎఫ్ఐఆర్ ప్రతిని కూడా జతచేయలేదు.
ఆగస్టు 14న వైర్ కార్యాలయానికి సమన్లు అందాయి. ఆగస్టు 18న అటువంటి సమన్లే కరణ్ థాపర్‌కు కూడా అందాయి. ఆగస్టు 22న గువాహటిలోని పాన్‌బజార్‌లో ఉన్న క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో హాజరుకావాలని ఆ సమన్లలో ఆదేశించారు. హాజరుకాని పక్షంలో అరెస్టును ఎదుర్కోవలసి వస్తుందని కూడా అందులో హెచ్చరించారు. వరదరాజన్, కరణ్ థాపర్‌పై దేశద్రోహం కేసు మోపడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అస్సాం పోలీసులు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని ది ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ది ఇండియన్ విమెన్ ప్రెస్ కోర్, ఎడిటర్స్ గిల్డ్ మండిపడ్డాయి.