గువాహటి, ఫిబ్రవరి 15: అస్సాంలో బాల్యవివాహాలపై కఠిన చర్యల పేరుతో పెద్ద సంఖ్యలో జరుగుతున్న ఆరెస్టులు ప్రజల వ్యక్తిగత జీవితంలో విధ్వంసం సృష్టిస్తున్నాయని గౌహతి హైకోర్టు వ్యాఖ్యానించింది. అటువంటి కేసుల్లో నిందితుల కస్టడీ విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. అదేవిధంగా బాల్యవివాహాల నిందితులపై పోక్సో వంటి కఠిన చట్టాలను అమలు చేయడంతో పాటు లైంగిక దాడి ఆరోపణలపై కేసులు నమోదు చేయడంపై అస్సాంలోని బీజేపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. పలువురు నిందితులు దాఖలు చేసిన ముందస్తు, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు.. అందరికీ బెయిల్ మంజూరు చేసింది.
వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ‘కస్టడీ విచారణ చేయాల్సిన అంశం కాదు ఇది. మీరు(ప్రభుత్వం) చట్టం ప్రకారం నడుచుకోవాలి. మేం చెప్పడానికి ఏమీ లేదు. ఎవరైనా తప్పు చేసినట్టు గుర్తిస్తే చార్జిషీట్ వేయండి. కోర్టు విచారణలో అతను/ఆమె దోషిగా తేలితే.. తప్పకుండా వారికి శిక్ష పడుతుంది’ అని న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొన్నది. ‘చిన్న పిల్లలు ఉంటారు. కుటుంబసభ్యులు, వృద్ధులు కూడా ఉంటారు. అరెస్టులు వంటి చర్యలు తీసుకోవడం సరికాదు. కచ్చితంగా ఇది చెడు ఆలోచన’ అని వ్యాఖ్యానించింది. అస్సాంలో బాల్య వివాహాల కేసులకు సంబంధించి ఈ నెల 3 నుంచి 14 వరకు 4,225 కేసులు నమోదు చేసిన పోలీసులు.. మొత్తంగా 3,031 మందిని అరెస్టు చేశారు.