సిటీబ్యూరో/చార్మినార్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ): నూటయాభై ఏళ్ల క్రితం నిజాంపేటలో ప్రారంభమైన చార్మినార్ పోలీస్‌స్టేషన్ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చార్మినార్ కట్టడం పక్కనే ఏర్పాటైంది. అప్పటినుంచి ఈ ప్రాంతంలో ఎటువంటి కల్లోలాలు తలెత్తినా, ఏ విధమైన సంఘటనలు జరిగినా చార్మినార్ పోలీసులే కీలక బాధ్యతలు నిర్వర్తించేవారు. ఏ రోజుకారోజే చార్మినార్ వద్ద సున్నితమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎస్హెచ్ఓ బాధ్యత చాలా ముఖ్యమైనది. కానీ గత పదిహేను రోజులుగా ఇన్స్పెక్టర్ లేకపోవడంతో అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. రంజాన్ మాసం కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో శాంతిభద్రతల విషయంలో అటు పోలీసుల్లో, ఇటు స్థానికుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
ఇన్స్పెక్టరే లేరు..!
చార్మినార్ పోలీస్‌స్టేషన్‌కు పదిహేను రోజులుగా ఎస్హెచ్ఓ లేరు. గతనెల 18వ తేదీన చార్మినార్ ఇన్స్పెక్టర్గా ఉన్న రమేశ్‌ను ఫిల్మ్‌నగర్ పీఎస్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చార్మినార్ పోలీస్‌స్టేషన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు స్టేషన్ అధికారి లేకుండా ఇంతకాలం ఎప్పుడూ లేదని స్థానికులు చెప్పారు. చార్మినార్‌ను అత్యం త ప్రాధాన్యం కలిగిన సున్నితమైన ప్రదేశంగా చూసి ఇక్కడ పోలీసింగ్ ప్రాధాన్యమివ్వాల్సిన కమిషనరేట్ అధికారులు ఆ దిశగా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నా యి. అసలు చార్మినార్‌కు ఎందుకు ఇన్స్పెక్టర్ను కేటాయించలేదనే చర్చ జరుగుతుండగా, ఇప్పటివరకు జరిగిన పోస్టింగులన్నీ కమిషనరేట్ కీలక అధికారికి సంబంధించినవే కాగా ఈ పోస్టింగ్ కూడా తనకు సంబంధించిన వారికి ఇవ్వడానికి కొంత సమయం తీసుకుంటున్నారంటూ పోలీసుశాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటువైపు రాని సీపీ సజ్జనార్..
ఐదు దశాబ్దాలుగా హైదరాబాద్ పోలీసు కమిషనర్లుగా పనిచేసిన వారంతా దాదాపుగా ప్రతి శుక్రవారం చార్మినార్ వద్దకే వచ్చి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించేవారని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. అప్పట్లో జరిగిన మతఘర్షణలు, రాళ్ల దాడుల నేపథ్యంలో ఒక వర్గానికి చెందిన ప్రార్థన మందిరాల్లో ప్రార్థనల అనంతరం పోలీసింగ్ ఎలా జరుగుతున్నదని పోలీసుబాసులే ప్రత్యక్షంగా పర్యవేక్షించేవారు.కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సీపీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చార్మినార్ ప్రాంతానికి వచ్చిన సందర్భాలే తక్కువని, అందులోనూ ఒకట్రెండు పోలీసులు చేపట్టిన పెద్ద కార్యక్రమాలకు వచ్చి వెళ్లారు తప్ప శుక్రవారాలు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. చార్మినార్ మాత్రమే కాకుండా మీర్చౌక్లో కూడా ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉందని, అక్కడ కూడా ఎవరిని నియమించకపోవడంతో స్థానికంగా ఈ రెండు స్టేషన్ల విషయంలో కమిషనరేట్‌లో ఏం జరుగుతున్నదనే చర్చ జరుగుతుంది.
రంజాన్ టెన్షన్..
ఈ నెల మూడో వారంలో ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ ప్రారంభమవుతుంది. పోలీసు గస్తీ 24గంటలు కొనసాగించాల్సి ఉంటుంది. కాబట్టి చార్మినార్ జోన్‌తోపాటు వేర్వేరు పోలీస్స్టేషన్ల నుంచి పోలీసు సిబ్బందిని అదనపు బాధ్యతల మీద చార్మినార్‌కు బందోబస్తు కోసం పంపిస్తారు. అటువంటి పరిస్థితుల్లో రంజాన్ మరో పదిహేనురోజుల్లో ప్రారంభం కానుండగా వ్యాపార సముదాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల సమస్య తదితర అంశాలపై సమీక్షించడానికి స్థానికంగా ఉండవలసిన అధికారే లేరు. చార్మినార్ వద్ద ఏదైనా సమస్య వస్తే ఎలా అంటూ అటు స్థానికుల్లో, ఇటు పోలీసుల్లో టెన్షన్ నెలకొంది.