Diljit Dosanjh : పంజాబి సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్ మేనేజర్ గురుప్రతాప్ సింగ్ కాంగ్ ఇంటిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన హరియాణాలోని కర్ణాల్ పరిధి, గోండర్ గ్రామంలోని గురుప్రతాప్ సింగ్ ఇంటి వద్ద బుధవారం జరిగింది. అయితే, ఈ ఘటనకు పాల్పడింది తామే అని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది.
కాగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని హరియాణా పోలీసులు తెలిపారు. గురుప్రతాప్ సింగ్ కానీ, అతడి కుటుంబ సభ్యులు కానీ తమకు ఫిర్యాదు చేయలేదని కర్ణాలె ఎస్పీ నరేంద్ర బిజర్నియా తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసుల బృందం అక్కడికి చేరుకుని, ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ఘటనా స్థలంలో ఎలాంటి బుల్లెట్లు, ఆధారాలు ఏమీ లభించలేవని పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం ఈ ఘటనకు పాల్పడింది తామే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన టైసన్ బిష్ణోయ్, అర్జూ బిష్ణోయ్, హరి బాక్సర్ ప్రకటించుకున్నారు.
ఈ ఘటనను పంజాబ్ మంత్రి హర్పాల్ సింగ్ చీమా ఖండించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని ఆయన విమర్శించారు. ఏ రాష్ట్రం కూడా లారెన్స్‌ను కస్టడీలోకి తీసుకోవడం లేదని, తమ పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరినీ వాళ్లు బెదిరిస్తున్నారని హర్పాల్ సింగ్ అన్నారు. సింగర్, నటుడు అయిన దిల్జిత్ దోసాంజ్.. త్వరలో వరల్డ్ టూర్ నిర్వహిస్తున్నారు. నార్త్ అమెరికాలో ఆరా వరల్డ్ టూర్ 2026 పేరుతో కార్యక్రమం జరుగుతోంది. ఈ టూర్ వచ్చే జూన్ వరకు జరగనుంది.