పాలన్పూర్, జూన్ 19: ‘మీరంతా నా సోదరీమణులు.. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా ఒక అన్నగా తీర్చడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటా.. ఒక్క చిన్న పోస్ట్ కార్డు రాయండి.. ఇట్టే వచ్చి వాలి.. అట్టే సమస్యను పరిష్కరిస్తా..’ ప్రధానిగా నరేంద్రమోదీ భారతదేశ మహిళలందరికీ ఇచ్చిన భరోసా ఇది. ఈ భరోసాతోనే.. ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే 50 వేల మంది మహిళలు ‘అన్నా.. మోదీ మా సమస్య తీర్చండి’ అని వేడుకొంటూ ప్రధానికి ఆదివారం పోస్టు కార్డులు రాశారు. మోదీనేమో.. ఢిల్లీలో కూర్చొని తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా నల్లా నీళ్లిచ్చిన విషయాన్ని.. తానే ఇచ్చినట్టు సూపర్ మేకప్‌తో వాణిజ్య ప్రకటనలు ఇచ్చుకొంటారు. ఇంత పచ్చిగా బొంకినా ఎవరేమనుకొంటారోనన్న బెంగ కూడా ఆయనకు కానీ.. ఆయన ప్రభుత్వానికి కానీ లేనే లేదు. హర్‌ఘర్ జల్ యోజన అని తెలంగాణ భగీరథను కాపీ కొట్టి పెట్టుకొన్న పథకానికి వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు మోదీ, ఆయన వందిమాగధగణం బాకాలూదుకొంటారు.
కానీ ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌లోని ఒక్క నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా నీటికోసం అల్లాడిపోతున్న మహిళలు కనిపించనైనా కనిపించరు. దాదాపుగా 30 ఏండ్లుగా ఆ రాష్ట్రంలో బీజేపీయే అధికారాన్ని వెలగబెడుతున్నది. అందులో 13 ఏండ్లపాటు నరేంద్ర మోదీయే ముఖ్యమంత్రిగా పరిపాలించి గుజరాత్ మాడల్‌ను ఒక పర్ఫెక్ట్గా దేశమంతా ప్రచారం చేసుకొని ప్రధాని పదవికి ఎదిగారు. తనను తాను గొప్ప పరిపాలకుడిగా ప్రొజెక్ట్ చేసుకొన్నారు. కానీ.. ఆయన పరిపాలన ఎంత గొప్పదో.. ఆ రాష్ట్రంలోని వడ్గావ్ నియోజకవర్గంలో ఏ మహిళను అడిగినా చెప్తుంది. వడ్గావ్ నియోజకవర్గ ప్రజలంతా ప్రతి ఎండాకాలం నీళ్ల కోసం అల్లాడుతూనే ఉన్నారు. తమ సమస్యను తీర్చాలని దశాబ్దాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకొంటూనే ఉన్నారు. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం పరిష్కరించాలని విన్నపాలు చేసుకొన్నారు. కానీ ఆయనకు వారి గోడు పట్టనే లేదు.
500 కోట్లు లేవా?
తమ నియోజకవర్గంలో ఉన్న కర్మవాద్ సరస్సు, ముక్తేశ్వర్ డ్యామ్‌లను నర్మదా నది నీళ్లతో నింపాలని స్థానిక ప్రజలు ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. నర్మద నది నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి ఈ రిజర్వాయర్లను నింపడానికి రూ.500 కోట్లు కూడా పట్టదని కర్మవాద్, ముక్తేశ్వర్ జల్ అందోళన్ సమితి నేత రమేశ్పటేల్ లెక్కలతో సహా చెప్తున్నారు. రిజర్వాయర్‌లో నీళ్లు ఉంటే.. భూగర్భ జలాలు పెరిగి పంటలు పండుతాయని, పశువులకు మేత దొరికి పాల ఉత్పత్తి పెరుగుతుందని తద్వారా ఏడాదిలోనే పెట్టిన ఖర్చు వెనక్కు వస్తుందని ప్రభుత్వాలకు అర్థం చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంటింటికి నీళ్లిస్తున్నామని ఉత్తుత్తి ప్రకటనలిచ్చుకొంటున్న మోదీ సర్కారుకు సొంత రాష్ట్రంలో.. తన చెల్లెళ్లకు నీళ్లివ్వడానికి రూ.500 కోట్లు తక్కువయ్యాయా అని మహిళలు వాపోతున్నారు. వడ్గావ్లోని 125 గ్రామాల మహిళలు గత 3 మాసాలుగా నీళ్లకోసం ఉద్యమాలు చేస్తున్నారు. అయినా వీరి గోడును విన్నవారు లేరు. దీంతో విసుగెత్తిన మహిళలు సుమారు 50 వేల మంది ఆదివారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖాస్త్రం సంధించారు. సమస్య తీర్చకపోతే భారీ ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించారు.