సూరత్ : దేశంలోనే అత్యంత పెద్ద డిజిటల్ అరెస్టు(Digital Arrest) స్కాం చోటుచేసుకున్నది. గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన ఓ డాక్టర్‌ను సైబర్ క్రిమినల్స్ మోసం చేశారు. ఆ డాక్టర్ వద్ద నుంచి సుమారు 19 కోట్లు కాజేశారు. మూడు నెలల వ్యవధిలో ఆ మొత్తాన్ని డిజిటల్ అరెస్టు రూపంలో దోచేశారు. అధికారులమని చెబుతూ కొందరు వ్యక్తులు ఫోన్లో బెదిరించి ఆ డబ్బును తమ అకౌంట్లలోకి మళ్లించుకున్నారు. ఈ కేసులో సూరత్‌కు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని అకౌంట్లో రూ.కోటి ఉన్నట్లు గుర్తించారు. అయితే సీనియర్ డాక్టర్‌ను 19 కోట్ల మేర మోసం చేసిన వ్యక్తులకు చెందిన నెట్వర్క్ గుట్టు విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తొలుత మార్చి 15వ తేదీన ఓ లేడీ డాక్టర్‌కు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్లో అభ్యంతరకరమైన కాంటెంట్ ఉన్నట్లు ఆమెను బెదిరించారు. ఫోన్‌ను డిస్కనెక్ట్ చేసి, మనీల్యాండరింగ్ కేసు నమోదు చేయనున్నట్లు ఆ ఫోన్‌కాల్‌లో బెదిరించారు. ఆ తర్వాత వేర్వేరు వ్యక్తుల నుంచి అధికారులమని ఫోన్ కాల్స్ వచ్చాయి. సబ్ ఇన్స్పెక్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటూ ఆమెను బెదిరించారు. దీంతో ఆ డాక్టర్ డిజిటల్ అరెస్టు అయ్యింది. ఆ భయంలో ఆమె సుమారు 19 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది. మూడు నెలల వ్యవధిలో ఆ మొత్తాన్ని దాదాపు 35 వేర్వేరు అకౌంట్లకు పంపించింది.
డాక్టర్‌కు చెందిన బంగారు ఆభరణాలపై కూడా మోసగాళ్లు రుణం తీసుకున్నారు. ఆ డబ్బును వాళ్లు మరో అకౌంట్‌కు బదిలీ చేశారు. నిత్యం వీడియో కాల్స్ చేస్తూ కూడా ఆ డాక్టర్‌ను మోసగాళ్లు బెదిరించారు. అయితే ఇటీవల సడెన్‌గా ఆమెకు కాల్స్ ఆగిపోయాయి. దీంతో ఆ మహిళా డాక్టర్ తన బంధువులకు ఈ విషయాన్ని చెప్పింది. జూలై 16వ తేదన గుజరాత్‌లోని సీఐడీ సైబర్ క్రైంకు ఫిర్యాదు అందింది. ఇండియాలోనే ఇది అతిపెద్ద డిజిటల్ అరెస్టు కేసు అని అధికారులు చెబుతున్నారు. ఒక్క వ్యక్తి నుంచి అంత మొత్తాన్ని కాజేయడం తొలిసారి అని అనుమానిస్తున్నారు. నెట్‌వర్క్‌లో భాగమైన నిందితుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.