Suicide Attempt | అహ్మదాబాద్ : వాంతులతో భార్యాభర్తలిద్దరూ చనిపోగా.. వారి ముగ్గురు పిల్లలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆత్మహత్యాయత్నం చేశారా..? ఎవరైనా హత్యాయత్నానికి పాల్పడ్డారా..? అన్న విషయంలో స్పష్టత లేదు.
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని సంబర్కాంత జిల్లాలోని వడాలి పట్టణానికి చెందిన విను సాగర్(42) ఆయన భార్య కోకిలబెన్(40) తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నారు. అయితే శనివారం ఉదయం విను సాగర్, కోకిలబెన్, ముగ్గురు పిల్లలు వాంతులతో బాధపడడాన్ని ఇరుగుపొరుగు వారు గమనించారు. దీంతో అంబులెన్స్‌లో వారిని వడాలిలోని ఓ ప్రయివేటు హాస్పిటల్‌కు తరలించారు.
వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హిమ్మత్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. చికిత్స పొందుతూ భార్యభర్తలిద్దరూ చనిపోయారు. ఇక ముగ్గురు పిల్లలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ముగ్గురు పిల్లల్లో ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. కూతురు వయసు 19 ఏండ్లు కాగా, కుమారుల వయసు 18, 17 ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యాయత్నం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.