అహ్మదాబాద్, జనవరి 9: నేటి సమాజంలో చదువు కన్నా మొబైల్ చూడటంలోనే పిల్లలు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఇది తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే పిల్లల మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల వినియోగంపై ఆంక్షలు, పరిమితులు విధించాలని గుజరాత్ ప్రభుత్వం యోచిస్తున్నది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తానని గురువారం ప్రకటించింది. పిల్లలను మొబైల్స్, సామాజిక మాధ్యమాలకు దూరం చేసి వారిని ఆటస్థలాలు, చదువుకు దగ్గర చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ప్రఫుల్ పన్సేరియా మీడియాకు తెలిపారు. నిపుణులతో సంప్రదించిన తర్వాత దీనిపై మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆయన చెప్పారు. కాగా, ఇటీవల ఆస్ట్రేలియా 16 ఏండ్ల లోపు వారు సామాజిక మాధ్యమ వినియోగంపై నిషేధం విధించింది.