న్యూఢిల్లీ, నవంబర్ 3: ఎట్టకేలకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. మొదటి విడతలో 89 సీట్లకు డిసెంబర్ 1న, రెండో విడతలో 93 సీట్లకు డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ నెల 14, 17 తేదీల్లోగా నామినేషన్లను స్వీకరించి, 15, 18 తేదీల్లో పరిశీలన చేయనున్నట్టు వివరించింది. తొలి విడతకు ఈ నెల 17, రెండో విడతకు ఈ నెల 21న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. పట్టణాల్లో 34,276, గ్రామాల్లో 17,506 కలిపి మొత్తం 51,782 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నది. ఈ ఎన్నికల్లో మొత్తం 4.9 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో 4.6 లక్షల మంది తొలిసారి ఓటు వేయనున్నారు. ఫలితాలను హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో పాటు డిసెంబర్ 8న లెక్కించి, ప్రకటించనున్నది. మోర్బి ఘటన వల్లే గుజరాత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఆలస్యమైందని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. వాస్తవానికి హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు గుజరాత్‌కు కూడా ఒకేసారి షెడ్యూల్ ప్రకటిస్తారని అంతా భావించినప్పటికీ, గుజరాత్ షెడ్యూల్‌ను ఈసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గుజరాత్‌కు బీజేపీ మరిన్ని వరాలు ప్రకటించేలా ఎన్నికల కోడ్ అడ్డురాకుండా ఉండేందుకే షెడ్యూల్‌ను వాయిదా వేశారనే ఆరోపణలు వచ్చాయి.ఎన్నికల షెడ్యూల్ ఇలా..
నామినేషన్లు: మొదటి విడతకు – నవంబర్ 14 వరకు,
రెండో విడతకు – నవంబర్ 17 వరకు
పోలింగ్: డిసెంబర్ 1, 5.. ఫలితాలు: డిసెంబర్ 8న