Bullet Train Site Accident | ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు మార్గంలో ట్రాక్ నిర్మాణ పనుల్లో అపశృతి చోటు చేసుకున్నది. వల్సాడ్ వద్ద ట్రాక్ నిర్మాణం వద్ద గిర్డర్ కుప్పకూలడంతో ఒక కార్మికుడు అక్కడికక్కడే మరణించాడు. మరో ఇద్దరు కార్మికులు క్షతగాత్రులయ్యారు. ఆనంద్ జిల్లా పరిధిలో జరిగిన ఈ ప్రమాద సంగతి తెలియగానే జిల్లా అధికారులు, పోలీసులు, అగ్ని మాపక దళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ పనులు చేపట్టారు.
‘బుల్లెట్ రైలు ప్రాజెక్టు సైట్ వద్ద నిర్మిస్తున్న గిర్డర్ కూలింది. దాని కింద నలుగురు కార్మికులు చిక్కుకున్నారు. వారిలో ఇద్దరిని బయటకు తీసి చికిత్స కోసం దవాఖానకు తరలించాం’ అని ఆనంద్ జిల్లా ఎస్పీ గౌరవ్ జసానీ మీడియాకు చెప్పారు. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ కూడా ఈ ఘటనను ధృవీకరించింది. ‘మహీ నదిపై వంతెన నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన గిర్డర్ కూలిపోవడంతో కాంక్రీట్ బ్లాకుల మధ్య కార్మికులు చిక్కుకున్నారు’ అని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ పేర్కొంది.