Ayodhya | అయోధ్య, అక్టోబర్ 30: దీపావళి సందర్భంగా దీపకాంతులతో అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఈ సందర్భంగా రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. 8వ దీపోత్సవం సందర్భంగా ఏకకాలంలో అత్యధిక మంది హారతిలో పాల్గొనడం, అత్యధిక సంఖ్యలో నూనె దీపాల ప్రదర్శనతో అయోధ్య గిన్నిస్ రికార్డులకెక్కింది. ఏకకాలంలో 25 లక్షలకు పైగా ప్రమిదలలో దీపాలను వెలిగించారు. అలాగే 1,121 మంది వేదాచార్యులు హారతిని సమర్పించి రికార్డు నెలకొల్పారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు ప్రతినిధులు ప్రవీణ్ పటేల్, నిశ్చల్ భారోత్లు బుధవారం సాయంత్రం ఈ రికార్డులను నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు యూపీ టూరిజం జిల్లా యంత్రాంగం, అయోధ్య, సరయు హారతి సమితులను అభినందించారు. అంతకు ముందు అత్యధికంగా 22,23,676 దీపాలు వెలిగించడం రికార్డుగా ఉండగా, ప్రస్తుతం 25,12,585 దీపాలతో దానిని అధిగమించారు. కాగా, రాముని జన్మస్థలమైన అయోధ్య మీదుగా ప్రవహించే సరయు నది ఒడ్డున 2017 నుంచి దీపావళికి ఒక రోజు ముందు ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.