న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతంలో రద్దు చేసిన కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసిందని వచ్చిన వార్తా కథనాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం ఖండించింది. ఆ వార్తలో నిజం లేదని, ఆర్బీఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలిపింది.
అటువంటి సమాచారాన్ని పంచుకునే ముందు విశ్వసనీయ వర్గాల నుండి ధ్రువీకరించుకోవాలని పీఐబీ పౌరులకు సూచించింది. తప్పు దారి పట్టించే లేదా వక్రీకరించిన కంటెంట్‌ను తమకు నివేదించాలని కూడా ప్రజలను కోరింది. రద్దు చేసిన రూ.500, 1000 నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.