PM Modi | దేశ ప్రజలకు దీపావళి పండుగ ముందే ఆనందం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ అవార్డు 2025 విజేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అనుకూలంగా వెళ్లడమే తమ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో పౌరుల జీవన నాణ్యత మెరుగుపడుతుందన్నారు. వినియోగం, వృద్ధికి బూస్టర్ డోస్ లభిస్తుందని చెప్పారు. హెయిర్ పిన్నులు కూడా విదేశాల నుంచి తెచ్చుకునే విధానం మారాలని.. వంటల నూనెల కోసమే రూ.లక్ష కోట్లకుపైగా విదేశీలకు వెళ్తోందన్నారు. ఆ రూ.లక్షకోట్లు మనవద్దే ఉంటే మంచి పాఠశాలలు నిర్మించవచ్చన్నారు.
కొత్త ఆవిష్కరణలతో ఆత్మనిర్బర్ భారత్ మరింత ముందే సాకారమని.. చంద్రయాన్ విజయంతో సైంటిస్టులు కావాలనే ఆకాంక్ష విద్యార్థుల్లో పెరిగిందన్నారు. చిన్నారుల్లో డిజిటల్ దుష్ప్రభావాన్ని కూడా తగ్గించే బాధ్యత మనపైనే ఉందన్నారు. గేమింగ్, గ్యాంబ్లింగ్ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుందన్నారు. యువత గ్యాంబ్లింగ్ బారినపడకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. వోకల్ ఫర్ లోకల్ నినాదం మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సరైన పద్ధతిలో వెళ్తే ఆన్లైన్ గేమింగ్‌లో మనం ఆధిపత్యం చెలాయించగలమన్నారు. ఆన్లైన్ గేమింగ్‌లో భారీ ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ‘హర్ ఘర్ స్వదేశీ-ఘర్‌ఘర్ స్వదేశీ’ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి గాంధీజీ ఇచ్చిన స్వదేశీ నినాదం అందరూ పాటించాలని పిలుపునిచ్చారు.
స్వదేశీ విధానంతోనే మరింత స్వావలంభన సాధించగలమని, స్వదేశీ వస్తు వినియోగం, మేడిన్ ఇండియాను విద్యార్థి దశ నుంచే అలవాటు చేయాలన్నారు. దేశీయ ఉత్పత్తులను మనమే గౌరవించాలి, ఆదరించాలని కోరారు. స్వదేశీ డే, స్వదేశీ వీక్‌ను పండుగగా నిర్వహించుకోవాలని.. ప్రతి ఇంట్లో, ప్రతివ్యాపారి తన దుకాణం ముందు స్వదేశీ అని బోర్డు పెట్టాలన్నారు. మనదేశంలో తయారు చేసిన వస్తువులను మాత్రమే వాడాలని.. దేశీయ ఉత్పత్తులు వాడేందుకు గర్వించాలన్నారు. మేడిన్ ఇండియాపై చిన్నాపెద్ద అందరూ ఆలోచించాలని.. దేశీయ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశభక్తి, ఆత్మగౌరవం, స్వయం సంవృద్ధితో దేశాన్ని ముందుకు నడిపిద్దామన్నారు. సకాలంలో మార్పులు లేకుండా.. నేటి ప్రపంచ పరిస్థితుల్లో మన దేశానికి సరైన స్థానాన్ని ఇవ్వలేమన్నారు.
ఈ సారి ఆగస్టు 15న భారతదేశాన్ని స్వావలంబన చేయడానికి సంస్కరణలు అవసరమని ఎర్రకోట నుంచే చెప్పానని గుర్తు చేశారు. దీపావలి, ఛఠ్పూటకు ముందే దేశ ప్రజలకు రెట్టింపు ఆనందం కలుగుతుందన్నారు. ప్టెంబర్ 22న నవరాత్రి తొలిరోజున జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వస్తాయన్నారు. ఇవన్నీ ఖచ్చితంగా ‘మాతృ శక్తి’కి సంబంధించినవన్నారు. ఎనిమిది సంవత్సరాల కిందట జీఎస్టీ అమలు చేసిన సమయంలో అనేక దశాబ్దాల కల సాకారమైందని ఆయన అన్నారు. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ చర్చ ప్రారంభం కాలేదని.. ఈ చర్చలు అంతకుముందు కూడా జరిగేవి కానీ ఎప్పుడూ ఏమీ జరుగలేదన్నారు. జీఎస్టీ స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద ఆర్థిక సంస్కరణలలో ఒకటి అని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ఈ సంస్కరణలు దేశానికి మద్దతు ఇవ్వడంతో పాటు.. దేశంలోని సామాన్య ప్రజల డబ్బు ఆదా అవుతుందని.. మరోవైపు, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు.