(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం జీఎస్టీ 2.0 పేరిట తాజాగా తీసుకొచ్చిన సవరణలు కార్మికులకు శరాఘాతంగా మారాయి. లేబర్ చార్జీలపై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచడంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) గడ్డు పరిస్థితులు దాపురించాయి. 22వ తేదీ నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తే, ఇక తాము కంపెనీలను మూసేసుకోవాల్సిందేనని ఎంఎస్ఎంఈ ప్రతినిధులు చెప్తున్నారు. పన్ను పెంపుపై కేంద్రం పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిర్మాణ, తయారీ రంగానికి చెందిన పెద్ద పరిశ్రమలు కొన్ని ప్రాజెక్టులను కాంట్రాక్టుల రూపంలో ఎంఎస్ఎంఈలకు అప్పగిస్తాయి. అలా అప్పగించిన ప్రాజెక్టులపై లేబర్ చార్జీల పేరిట సీజీఎస్టీ చట్టం, 2017 సెక్షన్ 2(119) కింద కేంద్రప్రభుత్వం ఇప్పటివరకూ 12 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నది. దీన్ని లేబర్ ట్యాక్స్‌గా పిలుస్తున్నారు. మ్యాన్ పవర్, మెటీరియల్ సరఫరా తదితర సేవలు ఈ పన్ను కిందకు వస్తాయి. లేబర్ ట్యాక్స్ కారణంగా తమపై పెను భారం పడుతున్నదని, కార్మికుల వేతనాల్లో కోతలు పెట్టాల్సి వస్తున్నదని ఎంఎస్ఎంఈ ప్రతినిధులు ఎప్పటి నుంచో కేంద్రానికి మొరపెట్టుకొంటున్నారు. లేబర్ చార్జీలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జీఎస్టీ శ్లాబులను 5 శాతం, 18 శాతానికే పరిమితం చేయడంతో ఇప్పటివరకూ 12 శాతంగా ఉన్న లేబర్ ట్యాక్స్‌ను కచ్చితంగా 5 శాతం శ్లాబ్‌లోకి తీసుకొస్తారని అంతా భావించారు. అయితే, దీనికి విరుద్ధంగా తాజా సవరణలో లేబర్ ట్యాక్సును కేంద్రం తగ్గించాల్సిందిపోయి.. 18 శాతానికి పెంచింది. దీంతో ఈ నిర్ణయం తమపై పెనుభారాన్ని మోపుతున్నదని ఎంఎస్ఎంఈల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పన్నుల చెల్లింపులతో చిరు పరిశ్రమలు కుదేలై, మూతబడుతాయని అంటున్నారు. ఇదే జరిగితే, ఎంఎస్ఎంఈలపై ఆధారపడి పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడటం ఖాయమని చెప్తున్నారు. కేంద్రం పునరాలోచించి, వెంటనే ట్యాక్సును తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
విదేశీ దిగుమతులను తగ్గించుకోవాలని, దీని కోసం స్వదేశంలోని చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రసంగాల్లో ఊదరగొట్టే ప్రధాని మోదీ.. విధానపర నిర్ణయాల్లో మాత్రం పన్నుల మోతతో చిరు పరిశ్రమను చిన్నచూపు చూస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే, ‘మేకిన్ ఇండియా’కు తూట్లు పొడిచిన మోదీ ప్రభుత్వం.. చిరు పరిశ్రమలకు ప్రోత్సాహకాలను కూడా ఎత్తేసింది. దీంతో గడిచిన 11 ఏండ్లలో 6.25 లక్షల కంపెనీలకు తాళంపడ్డట్టు నివేదికలు చెప్తున్నాయి. లేబర్ చార్జీలపై జీఎస్టీ పెంపుతో ఇప్పుడు మరిన్ని కంపెనీలు మూతపడొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.