న్యూఢిల్లీ: ఖజానాకు ఆదాయమే ప్రధాన లక్ష్యంగా జీఎస్టీని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మానవత్వం కోణాన్ని కూడా పూర్తిగా విస్మరిస్తున్నది. సకలాంగులూ.. వికలాంగులూ.. తమకు ఒకటేనంటూ నిర్దాక్షిణ్యంగా వారి సహాయ పరికరాలపై కూడా పన్ను వేస్తున్నది. దేశంలో దివ్యాంగులకు ఉపయోగపడే అనేక సహాయ పరికరాలు ఉదా.. వీల్ చైర్లు, బ్రెయిలీ పుస్తకాలు, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలు, స్పెషల్ సాఫ్ట్వేర్లు జీఎస్టీ నుంచి తప్పించులేక పోయా యి. ఇవన్నీ దివ్యాంగుల రోజువారీ జీవనానికి అవసరమైనవి. ఇవి ఐశ్యర్యానికి గానీ , విలాస జీవితానికి గానీ సంబంధించినవి కావు. బతికే హక్కు కోసం అవసరమయ్యే వస్తువులు. కానీ జీఎస్టీ పేరుతో వీటిపై 5 నుంచి 18 శాతం వరకు పన్ను వేసి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇటీవల జీఎస్టీ సవరణలో కూడా వీరికి ఎలాంటి ఉపశమనం చేకూర్చలేదు. అటువంటి ముఖ్యమైన పరికరాలపై పన్ను విధించడం వల్ల వైకల్యం ఉన్న వ్యక్తుల కదలిక, కమ్యూనికేషన్, స్వాతంత్య్రం కోరుకునే వారిపై కూడా నిర్దాక్షిణ్యంగా శిక్ష విధించినట్టేనని న్యాయవాదులు, పార్లమెంటరీ ప్యానెళ్లు వాదిస్తున్నాయి.
ప్రస్తుతం వీల్చైర్లు, హియరింగ్ ఎయిడ్లు, క్లచెస్, బ్రెయిలీ పేపర్, స్క్రీన్ రీడర్లపై 5 శాతం రాయితీతో జీఎస్టీని వేస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో పునరావాసం, చికిత్సా సేవలు 18 శాతం వరకు అధిక రేట్లను విధిస్తున్నారు. జీఎస్టీలో తక్కువ శాతం పన్ను అయిన 5 శాతం తయారీదారులు ముడి పదార్థాలపై ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ నుంచి ప్రయోజనం పొందేందుకు వీలు కల్పిస్తుందని జీఎస్టీ కౌన్సిల్ వాదించినప్పటికీ ఈ ప్రయోజనం అరుదుగా వినియోగదారుడిని చేరుతుందని నిపుణులు అంటున్నారు. ముడి పదార్ధాలపై తరచుగా 18 శాతం పన్ను విధించడంతో ఉత్పత్తి ఖర్చును తయారీదారులు వినియోగదారుల నెత్తి మీదకు తోసేస్తున్నారు. దీంతో దివ్యాంగ కుటుంబాలు అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తున్నది.
దివ్యాంగులపై జీఎస్టీ భారం మోపడం వల్ల పలు సమస్యలు వస్తున్నాయి. దివ్యాంగులు, వారి కుటుంబాలు ఎక్కువ మంది తక్కువ ఆదాయ వర్గాల్లో ఉంటారు. వీరిలో ఎక్కువగా చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న వృత్తులు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వీరిపై జీఎస్టీ విధించడం వల్ల వారిపై మరింత ఆర్థిక భారం పడుతుంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలి. కానీ దివ్యాంగులు తమ సహాయ పరికరాలు కొనడానికి కూడా పన్ను చెల్లించాలి. అంటే ఇది వివక్ష చూపడమే. వికలాంగుల వస్తువులు లగ్జరీ వస్తువులు కావు కాబట్టి వాటిపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలి అని వికలాంగుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు అంటున్నారు.
వికలాంగుల సహాయ పరికరాలు ఐచ్ఛిక వస్తువులు కావని, నిస్సందేహంగా అవి ఉపాధి, దైనందిన జీవితాన్ని గౌరవంగా పొందేందుకు వీలు కల్పించే ప్రాథమిక అవసరాలు అని ఎంపీ రమాదేవి నేతృత్వంలోని సామాజిక న్యాయం, సాధికారిత కమిటీపై వేసిన పార్లమెంటరీ కమిటీ స్పష్టంగా పేర్కొంది. దీంతో దివ్యాంగులు వినియోగించే పరికరాలు, సహాయకాలపై పన్ను పూర్తిగా జీఎస్టీ నుంచి మినహాయించడమో లేదా సున్నా శాతమో ఉండాలని సిఫార్సు చేసింది.
ఇక న్యాయ కోణంలో చూస్తే ముఖ్యమైన వస్తువులపై పన్ను విధించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 19, 21 కింద హామీ ఇచ్చిన హక్కులను బలహీన పరుస్తుందని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ఈ హక్కులు సమానత్వం, వివక్షత లేనితనం, గౌరవాన్ని కాపాడుతుంది. పన్ను విధింపు హక్కు అనేది పౌరుడి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని సుప్రీం కోర్టు చాలాసార్లు పేర్కొంది. ప్రస్తుత వ్యవస్థ దీనికి విరుద్ధంగా ఉందని దివ్యాంగ న్యాయవాదులు అంటున్నారు. ఇక ఈ విషయంలో మహిళలపై అసమాన ప్రభావం ప్రస్తావిస్తే పురుషుల కంటే మహిళల్లో వైకల్యం ప్రాబల్యం ఎక్కువగా ఉంది.
వికలాంగుల సహాయ పరికరాలను జీరో కేటగిరీలో పెట్టి జీఎస్టీ నుంచి పూర్తిగా తొలగించాలి. ప్రభుత్వ పథకాల ద్వారా వాటిని తక్కువ ధరకు అందించాలి. సబ్సిడీలు, సౌకర్యాలు కల్పించాలి. దివ్యాంగులకు పన్ను మాఫీ కల్పించడం కేవలం ఆర్థిక ఉపశమనం కాదు అది వారి గౌరవం, సమానత్యవం, మౌలిక హక్కులను ఇచ్చే గుర్తింపు కూడా అని నిపుణులు పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు వైకల్య సహాయాలపై పన్నును పూర్తిగా మినహాయించాయి. వాటిపై పన్ను విధించడం అన్యాయం, ప్రతికూల ఫలితాన్ని ఇస్తుందని అంగీకరించాయి. సహాయ పరికరాలను విభిన్న కోడ్ కింద వర్గీకరించడం ద్వారా భారత దేశం ఈ నమూనాను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతానికి జీఎస్టీ కౌన్సిల్ పన్నును రద్దు చేయడాకి ఎలాంటి చర్య తీసుకోలేదు. కాని వాటిని మార్చాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. తదుపరి కౌన్సిల్ సమావేశం సమీపిస్తుండటంతో హక్కుల కార్యకర్తలు, పార్లమెంటరీ కమిటీలు అత్యవసర చర్య కోసం ఒత్తిడి తెస్తున్నాయి. పన్ను సంస్కరణలు అన్నవి తరచుగా సాంకేతికపరంగా రూపొందించినప్పటికీ ఈ సందర్భంలో నైతికతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు వాదిస్తున్నారు.