న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ప్రస్తుతమున్న జీఎస్టీని సవరించి జీఎస్టీ 2.0 తీసుకువస్తున్నామని, దీని ద్వారా ప్రజలపై భారం తగ్గించామని, ఇది ప్రజలకు దీపావళి బొనంజాయే అని కేంద్రం గొప్పగా చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు భారత వినియోగదారులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించినప్పటికీ ప్రజల పరిస్థితి అలా కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆహార పదార్ధాల కొనుగోలు మినహా ఇతర ఖర్చులకు డబ్బులు వెచ్చించేందుకు చాలా మంది వినియోగదారులు తగినంత సొమ్మును కూడబెట్టలేకపోయారని ఒక నివేదిక హెచ్చరించింది. ఆహార పరిశ్రమపై దృష్టి సారించిన పీడబ్ల్యూసీ ఇండియా ఇందుకు సంబంధించిన వాయిస్ ఆఫ్ కన్స్యూమర్ 2025 నివేదికను ఈ నెల 11న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీని 32 శాతం మంది తాము ఆర్థికంగా తట్టుకుంటున్నామని చెప్పగా, మరో 7 శాతం మంది తాము ఆర్థికంగా అభద్రతతో ఉన్నామని చెప్పారు.
జీఎస్టీ 2.0 (కొత్త పన్ను విధానం) అమలు కాక ముందే ప్రజలలో ఒక వర్గం (40 శాతం మంది) తమ ఆదాయంలో కేవలం బియ్యం, పప్పులు, కూరగాయలు, నిత్యావసర ఆహార సరుకులు కొనుగోలు చేయడానికే సరిపోయేదని వెల్లడించారు. అంటే ఇతర ఖర్చులైన విద్య, దుస్తులు, ప్రయాణాలకు డబ్బు వెచ్చించేందుకు వీలు కాకపోవడం కన్పించింది. ఆదాయ స్థాయి తక్కువగా ఉండటం, ఉద్యోగాల స్థిరత్వం లేకపోవడం వంటివి దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు. అయితే ఆహార వస్తువుల ధరలు పెరగడం వల్ల ప్రజలు ‘ఫుడ్ షాపింగ్’కే పరిమితమయ్యారు.
దీంతో జీఎస్టీ 2.0 రాకముందే ఈ పరిస్థితి ఉంటే కొత్త పన్ను విధానం తర్వాత ధరల పెరుగుదల, ఖర్చుల భారం మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య తరగతి, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలపై ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుందని సర్వే సూచిస్తోంది. మొత్తం మీద జీఎస్టీ 2.0 అమలుకు ముందు కూడా సుమారు 40 శాతం వినియోగదారులు కేవలం ఆహార అవసరాలను తీర్చుకోవడానికే పోరాడుతున్నారని సర్వే చూపిస్తున్నది.
కొత్త జీఎస్టీని ఇప్పుడు కేవలం 5 శాతం, 18 శాతం శ్లాబ్‌లకే పరిమితం చేశారు. దీంతో కొన్ని వస్తువుల ధరలు పెరుగుతుండగా, మరికొన్ని తగ్గనున్నాయి. జీఎస్టీ 2.0లో పన్ను రేట్లు పెరిగితే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా నిత్యావసరాలు, కిరాణా, ఆహార పదార్ధాలు, విద్యుత్ బిల్లులు వంటివి అదనపు భారం అవుతాయి. ఫలితంగా సాధారణ ప్రజల జీవన వ్యయం పెరుగుతుంది. ఇప్పటికే 40 శాతం ప్రజలు ఆహారం కొనుగోలు చేయడానికే ఇబ్బంది పడుతున్నారని తాజా సర్వే చెబుతోంది. జీఎస్టీ 2.0తో ధరలు పెరగడంతో విద్య, ఆరోగ్యం, దుస్తులు, ప్రయాణం వంటి వాటిపై ప్రజల ఖర్చులు మరింత తగ్గిపోతాయి. అంటే ఇకపై విలాస, స్వేచ్ఛాపూరిత ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయి.
పన్ను పెరుగుదల అన్ని వర్గాలపైనా ఎక్కువగానే ప్రభావం చూపినా మధ్య తరగతి, తక్కువ ఆదాయ వర్గాలపై ఎక్కువ భారం పడనుంది. బ్యాంకింగ్ చార్జీలు, రవాణా, విద్యా సేవలు, ఆరోగ్య సేవల మీద పన్ను ఎక్కువైతే వాటి భారం వినియోగదారుల నెత్తిపై పడుతుంది. అయితే జీఎస్టీ 2.0తో పన్ను వ్యవస్థ సరళీకరణ అవుతుందని, ఇది దీర్ఘకాల ప్రయోజనాన్ని ఇస్తుందని, పన్ను ఎగవేత తప్పుతుందని ప్రభుత్వం చెబుతున్నది. అయితే సాధారణ వినియోగదారులకు తక్షణ ప్రయోజనం కంటే తక్షణ భారమే ఎక్కువగా అనిపిస్తుంది. జీఎస్టీ 2.0 వల్ల వస్తువులు, సేవల ధరలు పెరిగే అవకాశం ఉండటంతో ప్రజల ఖర్చులు పెరిగి, జీవన ప్రమాణాలు క్షీణించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మధ్య తరగతి, పేద వర్గాలపై దీని ప్రభావం తీవ్రంగా పడనుంది.
భారత దేశంలో ‘జీవన వ్యయ సంక్షోభం కొంతవరకు ఉంది. అంటే గృహ పొదుపు శాతం నాలుగు సంవత్సరాల క్రితం కంటే నేడు తక్కువగా ఉంది. అయితే వాస్తవానికి బాధ్యతలు పెరిగాయి’ అని పీడబ్ల్యూసీ రిటైల్ అండ్ కన్స్యూమర్ మార్కెట్ల లీడ్ డైరెక్టర్ హితాంషు గాంధీ అన్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీల వ్యాపారి కేటగిరీ వారీగా విభజనపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఇటీవల విడుదల చేయడం ప్రారంభించిన నెలవారీ డేటాను ప్రస్తావిస్తూ రుణం చెల్లింపు అధిక శాతం కుటుంబాలపై చాలా తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నదని అన్నారు.
జీఎస్టీ ధర తగ్గింపు గొప్పగా ఉందని చాలామంది మురిసిపోతున్నారు. అయితే ఆ ధర తగ్గింపులో ఎక్కువ భాగం ఎలాక్ట్రానిక్స్ ఉత్పత్తిని కొనుగోలు చేయడం, యాత్రకు వెళ్లడం, బయట తినడం అంశాలకే పరిమితం అవుతుందని పిడబ్ల్యూసీ ఇండియా భాగస్వామి, రిటైల్, వినియోగదారుల రంగం నాయకుడు రవి కపూర్ అన్నారు. జీఎస్టీ రేటు తగ్గింపులు ఫార్మల్ సెక్టార్ తయారు చేసిన వస్తువులకు డిమాండ్‌ను పెంచుతాయని కూడా భావిస్తున్నారు. జీఎస్టీ రేటు తగ్గింపులు భారత దేశ వృద్ధి బేస్ పాయింట్లు (బీపీఎస్) పెంచుతాయని, ఒక పూర్తి సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 100 బీపీఎస్ తగ్గించవచ్చునని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. అయితే పన్ను తగ్గింపులో ఎంత భాగం తగ్గిన ధరల రూపంలో వినియోగదారులకు బదిలీ అవుతుందనే దానిపై ప్రశ్నలు మిగిలి ఉన్నాయి.