Grok : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (X) ఏఐ టూల్ గ్రోక్ (Grok AI) పై తాజాగా మరో వివాదం చెలరేగింది. రిపబ్లిక్ డే సందర్భంగా మాల్దీవుల నుంచి వచ్చిన శుభాకాంక్షల సందేశానికి సమాధానంగా ప్రధాని మోదీ (PM Modi) ఇచ్చిన సందేశం అర్థాన్ని గ్రోక్ పూర్తిగా మార్చేసింది. ఆ సందేశం భావాన్ని వక్రీకరించింది.
భారత 77వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు శుభాకాంక్షలు తెలిపారు. అందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. ఇరుదేశాల్లోని ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని అందులో రాసుకొచ్చారు. దివేహి (మాల్దీవులు అధికారిక భాష) లో ఆ పోస్టు పెట్టారు.
అయితే మోదీ సందేశాన్ని గ్రోక్ పూర్తిగా మార్చేసింది. ఆ సందేశానికి పూర్తిగా భిన్నమైన అర్థంలో ఆంగ్లంలోకి అనువాదం చేసింది. ‘మాల్దీవుల్లో భారత 77వ స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. అందులో మాల్దీవుల ప్రభుత్వం పాల్గొంది. ఈ ప్రభుత్వం భారత వ్యతిరేక ప్రచారాల్లో పాల్గొంది’ అని ఇరుదేశాల సంబంధాలను దెబ్బతీసేలా అనువదించింది.
గణతంత్ర దినోత్సవం పదం స్థానంలో స్వాతంత్ర్య దినోత్సవం అని ట్రాన్స్లేట్ చేసింది. ఇరుదేశాల సంబంధాలను దెబ్బతీసేలా ఉన్న ఈ అనువాదం వివాదాస్పదమవుతోంది. గ్రోక్పై ఆధారపడితే ప్రమాదం తప్పదని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఏఐ ఫీచర్లన్నీ ప్రయోగదశలోనే ఉన్నాయని సంబంధిత సంస్థలు చెబుతున్నాయి.
కాగా గ్రోక్ మహిళలు, చిన్నారుల అసభ్య చిత్రాలను సృష్టిస్తోందని ఇప్పటికే భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆరోపించాయి. దాంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఎక్స్.. గ్రోక్లో ఫొటోలను ఇబ్బందికరంగా మార్చే అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.