Sweeper’s Job | ఛండీగఢ్, సెప్టెంబర్ 3: దేశంలో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పట్టే వార్త ఇది. రోడ్లు ఊడ్చే పారిశుధ్య కార్మికుల ఉద్యోగాలకు డిగ్రీలు, పీజీలు చదివిన యువత పోటీ పడుతున్న పరిస్థితి బీజేపీ పాలిత హర్యానాలో నెలకొన్నది. హర్యానా కౌశల్ రోజ్గార్ నిగమ్(హెచ్కేఆర్ఎన్) డాటాలో వెల్లడైన అంశాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. హర్యానా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రభుత్వ సంస్థ ఇది. ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు ఉద్యోగాలను భర్తీ చేస్తుంటాయి. తాజాగా స్వీపర్ ఉద్యోగాల కోసం హెచ్కేఆర్ఎన్ ఒక ప్రకటన జారీ చేసి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ఉద్యోగాలకు ఆగస్టు 6 నుంచి సెప్టెంబరు 2 వరకు ఏకంగా 39,990 మంది పట్టభద్రులు, 6,112 మంది పీజీ చదివిన వారు దరఖాస్తు చేసుకున్నారు. 12వ తరగతి పూర్తి చేసిన మరో 1,17,144 మంది సైతం దరఖాస్తు పెట్టుకున్నారు.
తక్కువ జీతం.. కాంట్రాక్ట్ ఉద్యోగం
ఇంతలా పోటీ ఉండేందుకు ఇవేమీ ప్రభుత్వం కల్పించే శాశ్వత ఉద్యోగాలు సైతం కావు. జీతం కూడా భారీగా ఏమీ లేదు. కేవలం రూ.15 వేల నెలవారీ వేతనంతో ఇచ్చే కాంట్రాక్టు ఉద్యోగాలు ఇవి. పొరపాటున దరఖాస్తు చేశారని చెప్పడానికి కూడా వీలు లేదు. ఉద్యోగ ప్రకటనలోనే ఉద్యోగ బాధ్యతలు, చేయాల్సిన పనులను స్పష్టంగా పొందుపరిచారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాలను ఊడ్చడం, శుభ్రం చేయడం, చెత్త తొలగించడం వంటి పనులు చేయాల్సి ఉంటుందని ముందే పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంత భారీ సంఖ్యలో డిగ్రీలు, పీజీలు చదివిన యువత పోటీ పడుతున్నారంటే బీజేపీ పాలిత హర్యానాలో, దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చనే విమర్శలు వస్తున్నాయి.
ఉద్యోగాలు లేకే దరఖాస్తు చేసుకున్నాం: అభ్యర్థులు
చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకకపోవడం వల్లే స్వీపర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్టు అభ్యర్థులు చెప్తున్నారు. ‘ఉద్యోగాలు దొరకడం లేదు. నేను ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అందుకే పారిశుద్ధ్య కార్మికురాలి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నా’ అని సిర్సకు చెందిన రచనాదేవి(29) తెలిపారు. తాను ప్రస్తుతం పీజీ చదువుతున్నానని, నాలుగేండ్లుగా ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నట్టు చెప్పారు. ఉద్యోగాలు దొరకకపోవడం వల్లే స్వీపర్ పోస్టులకు దరఖాస్తు చేసినట్టు ఛర్ఖి దాద్రి జిల్లాకు చెందిన దినేశ్ కుమార్(బీఈడీ), ఆయన భార్య మనీష(నర్సింగ్) తెలిపారు. కాగా, హర్యానాలోని పట్టణ ప్రాంతాల్లో 15 ఏండ్ల నుంచి 29 ఏండ్ల మధ్య వయస్కుల్లో 11.2 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని నియతకాల కార్మిక శక్తి సర్వే డాటా చెప్తున్నది.