సిమ్లా: కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. వైరస్ వ్యాపిని నియంత్రించేందుకు పలు ఆంక్షలు విధించింది. ఈ నెల 24 వరకు సామాజిక, మతపరమైన కార్యక్రమాలను నిషేధించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వారాంతాల్లో మూసి ఉంటాయని తెలిపింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు 50 శాతం సిబ్బంది సామర్థ్యంతో పని చేస్తాయని పేర్కొంది.
అయితే అత్యవసర విభాగాలకు ఆంక్షల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆరోగ్య, పోలీస్, అగ్నిమాపక, బ్యాంకులు, విద్యుత్, నీరు మరియు పారిశుద్ధ్యం, ప్రజా రవాణా, టెలికాం వంటి అత్యవసర లేదా అవసరమైన సేవలతో వ్యవహరించే కార్యాలయాలకు ఈ పరిమితులు వర్తించవని తెలిపింది.
మరోవైపు కరోనాకు సంబంధించిన అంశాలు, కోర్టు వ్యవహారాలు, ఇతర న్యాయ కార్యలయాలకు సంబంధించి కరోనా నిబంధనలపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.