లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా లక్నోలోని బాపూ భవన్లో ప్రభుత్వ సీనియర్ అధికారి కాంట్రాక్టు ఉద్యోగిని వేధిస్తున్న వీడియో వైరల్ కావడంతో సదరు ఉద్యోగిని అరెస్ట్ చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖలో సెక్షన్ ఇన్చార్జ్గా పనిచేసే ఇచారామ్ యాదవ్ తనను 2018 నుంచి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని కాంట్రాక్టు ఉద్యోగిని ఆరోపించింది.
ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తానని నిందితుడు బెదిరించేవాడని ఆమె పేర్కొంది. ఇటీవల ధైర్యం కూడదీసుకున్న బాధితురాలు యాదవ్ అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న వీడియోను రూపొందించి ఆపై హుస్సేన్గంజ్ పోలీస్స్టేషన్లో అక్టోబర్ 29న ఫిర్యాదు చేసింది.
ఈ వీడియోలో నిందితుడు బాధితురాలిపై లైంగిక దాడికి ప్రయత్నిస్తుండగా ఆమె అతడిని తోసివేస్తుండటం కనిపించింది. ఈ తరహా పలు వీడియోలను తన ఆరోపణలకు మద్దతుగా బాధితురాలు పోలీసులకు సమర్పించింది.దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.