సిమెంట్ వేయకుండానే ఇటుకలతో గోడ
బీజేపీపాలిత యూపీలో కాలేజీ నిర్మాణంలో భారీ అవినీతి
యోగి సర్కారుపై మండిపడ్డ అఖిలేశ్
లక్నో, జూన్ 24: నవభారత పునాదులను మరింత బలోపేతం చేసే భావి ఇంజినీర్లు చదువుకునేందుకు నిర్మిస్తున్న నాలుగంతస్తుల ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల భవనమది. అయితే, నిర్మాణ దశలో ఉన్న ఆ కాలేజీ గోడలు ముట్టుకుంటేనే పడిపోతున్నాయి. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని యోగి పాలనలో బుసలుకొడుతున్న అవినీతికి తార్కాణం ఈ ఘటన. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే ఆర్కే వర్మ ఇటీవల ప్రతాప్ గఢ్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీని పర్యటించారు. అయితే, ఇటుకల మధ్య సిమెంట్ ఏ మాత్రం లేని అక్కడి గోడలను ఎమ్మెల్యే వట్టి చేతులతో తోయగానే అవి పేకమేడల్లా కూలిపోయాయి.
ఈ వీడియోను వర్మతో పాటు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా ట్విట్టర్లో షేర్ చేశారు. ‘బీజేపీ పాలనలోని యూపీలో అవినీతిని చూస్తే ఆశ్చర్యమేస్తున్నది. సిమెంట్ లేకుండానే ఇటుకలతో గోడను పేర్చేశారు’ అని అఖిలేశ్ మండిపడ్డారు. ‘రాణిగంజ్‌లో ఇది నాలుగు అంతస్తుల భవనం. ఇలాంటి నాణ్యతారాహిత్య నిర్మాణాలు యువత భవిష్యత్తును నిర్మించలేవు. పిల్లలను చంపడానికే దీన్ని కడుతున్నట్టు ఉన్నది’ అని వర్మ విమర్శించారు.