న్యూఢిల్లీ: గవర్నర్ పదవిని రద్దు చేయాలని లేదా చిల్లర రాజకీయాలకు పాల్పడని వ్యక్తిని ఏకాభిప్రాయంతో నియమించాలని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ (Abhishek Singhvi) అన్నారు.
గవర్నర్లు, ప్రతిపక్షాల పాలిత రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి సవాల్‌గా లేదా బెదిరింపుగా మారితే గవర్నర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఎన్నికలు జరిగేది సీఎంను ఎన్నుకునేందుకు కానీ, గవర్నర్‌ను ఎన్నుకునేందుకు కాదని అన్నారు.
కాగా, గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచడంపై అభిషేక్ సింఘ్వీ మండిపడ్డారు.
గవర్నర్లు బిల్లులను ఆమోదించకపోవడంతో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులకు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. దీని వల్ల పరిపాలన బాధాకరంగా మారుతోందని, ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయని తెలిపారు.
మరోవైపు గవర్నర్ మరో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లా, ఒకే ఒరలో రెండో కత్తిలా వ్యవహరిస్తున్నారని అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. గవర్నర్లు, సీఎంల కోసం అంబేద్కర్ రూపొందించిన సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం సిగ్గులేకుండా ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి విపక్షాల పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య పదేపదే ప్రతిష్టంభనలు నెలకొంటున్న నేపథ్యంలో సింఘ్వీ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.