Supreme Court | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2 : తమిళనాడు కేసులో ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన మేరకు బిల్లుల ఆమోదంపై గడువును రాష్ట్రపతి లేదా గవర్నర్లు పాటించని పక్షంలో పర్యవసానాలు ఏమిటని సుప్రీంకోర్టు మంగళవారం తెలుసుకోగోరింది. అన్ని బిల్లులకు గంపగుత్తగా ఒకే గడువును నిర్దేశించే అధికారం తమకు ఉందా అన్న అనుమానాలను కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై సమ్మతి తెలియచేసేందుకు గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించవచ్చా అన్న ప్రశ్నపై ఆరవ రోజు విచారణ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నదీ లేక ఉండిందీ అన్న అంశం ప్రాతిపదికన కాకుండా తాము ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గడువు లోపల బిల్లులపై గవర్నర్లు లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోని పక్షంలో వారిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. గడువు దాటిన బిల్లులకు ఆమోదం లభించినట్లేనని భావించడమే దీని పర్యవసానమని తమిళనాడు ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ జవాబిచ్చారు.
రాష్ట్రపతికి సంబంధించిన అంశాలకు మాత్రమే తమ రాజ్యాంగ వివరణను పరిమితం చేసుకుంటామని, కొన్ని రాష్ర్టాలు లేదా కొందరు వ్యక్తులకు సంబంధించిన కేసులకు కాదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదా కర్ణాటక వంటి రాష్ర్టాలను కూడా ఉదాహరణలుగా చూపిన పక్షంలో కేంద్రం సవివరంగా సమాధానం ఇవ్వవలసి ఉంటుందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ తాము ఒక్కో రాష్ట్రం కేసును చర్చించబోమని, కాని రాజ్యాంగ నిబంధనలను మాత్రమే చర్చిస్తామని తెలిపింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ సమ్మతి తెలియచేయకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారని ఫిర్యాదుచేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. బిల్లులను తిరస్కరించే అధికారం గవర్నర్లకు లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.