Saamna comments | చైనాలోని వూహన్ ల్యాబ్‌లోనే కొవిడ్ వైరస్ పుట్టి ప్రపంచమంతా పాకిందని అందరూ ఆరోపిస్తున్న తరుణంలో.. శివసేన ఉద్దవ్ వర్గం మాత్రం కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ఈ మేరకు శివసేన అధికార పత్రిక సామ్నాలో కథనాన్ని ప్రచురించింది. కొవిడ్ మార్గదర్శకాలు పాటించని పక్షంలో భారత్ జోడో యాత్రను ఆపాలని రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ చేసిన సూచన దరిమిలా.. సామ్నా పత్రికలో విచిత్ర వాదనతో కథనం ప్రచురించారు. ఈ కథనం అటు రాహుల్‌కు ప్రచారం తెచ్చిపెట్టకపోగా.. ప్రజలు నవ్విపోయేలా చేస్తున్నదని పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు.
కొవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించలేకపోతే జోడో యాత్రను సస్పెండ్ చేయడం లేదా వాయిదా వేయడం గురించి ఆలోచించాలని రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌లకు పంపిన లేఖపై ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం ఇవ్వాల కేంద్రంపై విరుచుకుపడింది. ‘భారత్ జోడో యాత్రలో కొవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించండి లేదా పాదయాత్రను ఆపండి అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. రాహుల్ గాంధీ యాత్రకు 100 రోజులు పూర్తయ్యాయి. యాత్రకు పెద్ద ఎత్తున ప్రజల మద్దతు వస్తున్నది. దీనిని కేంద్ర ప్రభుత్వం ఆపలేకపోయింది. కుట్ర పన్నిన కేంద్ర ప్రభుత్వం కొవిడ్-19 వైరస్‌ను విడుదల చేసినట్లు కనిపిస్తున్నది’ అని థాకరే క్యాంపుకు చెందిన పత్రిక సామ్నా తన సంపాదకీయం పేర్కొన్నది.
అంతటితో ఆగకుండా ‘రాహుల్ భారత్ జోడో’ యాత్ర హడావుడి వల్ల కొవిడ్ కేసులు పెరుగుతాయనే భయం సరైందే. కానీ, మూడేండ్ల క్రితం కరోనా విధ్వంసం సృష్టించిన సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను గుజరాత్‌కు ఆహ్వానించి లక్షలాది మందిని సమీకరించి మీరే కదా’ అని పత్రిక కథనంలో రాశారు. కేంద్రం లేఖపై అటు రాజస్థాన్ సీఎం గెహ్లాట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో రాహుల్ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి బీజేపీ, మోదీ ప్రభుత్వం ఆందోళన చెందుతున్నందునే కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలంటూ లేఖ రాశారని గెహ్లాట్ మీడియాతో చెప్పారు.