న్యూఢిల్లీ : దేశంలోని పలు ఔషధ కంపెనీలకు ఊరట లభించింది. 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ (ఎఫ్డీసీ) మందులపై నిషేధం విధిస్తూ కేంద్రం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది.
రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్థాలతో తయారైన ఒకే రూపంలోని ఔషధాన్ని ఎఫ్డీసీ డ్రగ్ అంటారు. ఎఫ్డీసీలతో తయారైన ఔషధాల అమ్మకం, పంపిణీ తక్షణం నిలిపేయాలంటూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలపై మ్యాన్‌కైండ్ ఫార్మా, ఇండోకో రెమిడీస్, లీఫోర్డ్ హెల్త్‌కేర్, నవిల్ ల్యాబరేటరీస్ తదితర కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి.
కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసిన న్యాయస్థానం నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేసును డిసెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.