న్యూఢిల్లీ : వంటగ్యాస్ (ఎల్పీజీ)కు ప్రభుత్వం అందచేస్తున్న సబ్సిడీపై కోత పడనున్నదా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలు గత నెలలో అమెరికా ఎగుమతిదారులతో ఎల్పీజీ సరఫరాపై వార్షిక ఒప్పందం కుదుర్చుకున్న దరిమిలా ఎల్పీజీ సబ్సిడీ ఫార్ములాపై పునరాలోచించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. పశ్చిమాసియా నుంచి జరిగే ఎల్పీజీ సరఫరాలకు ప్రామాణికంగా ఉన్న సౌదీ కాంట్రాక్టు ధర(సీపీ)ను ఉపయోగించి ప్రభుత్వం ప్రస్తుతం సబ్సిడీని లెక్కిస్తున్నది.
అయితే అమెరికా ప్రామాణిక ధరలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నిర్ణయించుకోవడంతో అమెరికా నుంచి రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున దీని ప్రభావం ఎల్పీజీ ధరలపై పడే అవకాశం ఉందని కంపెనీ అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాతో పోలిస్తే అమెరికా నుంచి జరిగే సరఫరాల రవాణా ఖర్చు నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. సౌదీ సీపీతో సమానంగా అమెరికా ఎల్పీజీ ఉన్నపుడే భారత్కు వెసులుబాటు అవుతుంది. గత నెల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ అమెరికా నుంచి దాదాపు 2.2 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్పీజీ దిగుమతి చేసుకునేందుకు ఏడాది కాంట్రాక్టును కుదుర్చుకున్నాయి. భారత్ దిగుమతి చేసుకునే ఎల్పీజీలో ఇది 10 శాతం ఉంటుంది.