న్యూఢిల్లీ, జూన్ 20: ‘రాష్ట్రపతి రేసులో ఉండబోన’ని పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మా గాంధీ మనవడు గోపాల్‌కృష్ణ గాంధీ సోమవారం ప్రకటించారు. ‘జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయాన్ని సృష్టించగలిగే, ప్రతిపక్షాల్లో ఐక్యతను కాపాడే వ్యక్తి రాష్ట్రపతిగా ఉండాలి. ఇందుకోసం నాకంటే బాగా పనిచేయగలిగినవారు ఉంటారనే అనుకొంటున్నాను. వారికి అవకాశం ఇవ్వాలి’ అని అభిప్రాయపడ్డారు. మంగళవారం విపక్షాల భేటీ జరగనున్న నేపథ్యంలోనే ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. విపక్షాల తరఫున నిలబెట్టాలనుకొన్న రాష్ట్రపతి అభ్యర్థుల జాబితాలో గోపాల్‌కృష్ణ గాంధీ కూడా ఉన్నారు. విపక్షాలు ప్రతిపాదించిన శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా ఇప్పటికే రేసు నుంచి తప్పుకొన్నారు. తాజాగా గోపాల్‌కృష్ణ గాంధీ కూడా పోటీ చేయబోనని ప్రకటించడంతో విపక్షాలు మళ్లీ అభ్యర్థి కోసం వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మాజీ బీజేపీ నేత, ప్రస్తుత తృణమూల్ నాయకుడు యశ్వంత్ సిన్హా పేరు తాజాగా తెరపైకి వచ్చింది.