Diwali : మన దేశంలో అన్ని పండుగలతోపాటు దీపావళి పండుగ (Diwali festival) ను ఘనంగా జరుపుకుంటారు. దీపావళి వచ్చిందంటే దీపాల వెలుగులు, బాణాసంచా పేలుళ్లతో అందరి ఇళ్లు ధగధగ మెరుస్తాయి. భారతీయులు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఈ దీపాల పండగకు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది. ఈ పండుగకు యునెస్కో (UNESCO) వారసత్వ గుర్తింపు దక్కింది.
యునెస్కో ఇన్‌టాంజిబుల్ (Intangible – స్పృషించ సాధ్యంకాని) కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండగను చేర్చారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరుగుతున్న యునెస్కో సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీపావళితో కలిపి ఇప్పటివరకు భారత్‌కు చెందిన 15 అంశాలు యునెస్కో వారసత్వ గుర్తింపు పొందినట్లయ్యింది. వాటిలో కుంభమేళా, కోల్‌కతా దుర్గాపూజ, గర్బా నృత్యం, యోగా, వేద పఠన సంప్రదాయం, రామాయణ గాథను ప్రదర్శించే రామ్‌లీల మొదలైనవి ఉన్నాయి.
వారసత్వ సంపదను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని యునెస్కో ప్రతినిధులు చెప్పారు. యునెస్కో 20వ సదస్సు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈనెల 13 వరకు జరుగనుంది. యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం భారత్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి. కాగా యునెస్కో గుర్తింపు కోసం 80 దేశాలు సమర్పించిన 67 ప్రతిపాదనలను కమిటీ పరిశీలిస్తోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వందల మంది ప్రతినిధులు వచ్చారు.
కాగా దీపావళి పండుగను యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చడాన్ని భారత్ స్వాగతించింది. భారతదేశంలోని ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఇది ఉత్సాహాన్ని కలిగించే విషయమని ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.